నాగార్జునసాగర్ ఎడమకాలువ 3వ జోన్ కు సాగునీటిని విడుదల చేయించాలి
రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు డా॥ నిమ్మల రామానాయుడుకు విజ్ఞప్తిచేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు
విజయవాడ : గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014-2019 లో సాగునీటి సంఘాల ప్రతినిధులు, రైతులు అన్ని రకాల అనుమతులు తీసుకుని ఆంధ్రప్రదేశ్ లోని 13 ఉమ్మడి జిల్లాల్లో నీరు-చెట్టు కార్యక్రమంలో 32,040 పనులను రు.2036 కోట్లుతో పనులు పూర్తి చేయటం జరిగింది. గత వై.సి.పి. ప్రభుత్వం 2019-2024 లో ఈ పనులకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నీరు-చెట్టు ఫిర్యాదుల విభాగం సమన్వయంతో పనులు చేసిన రైతులు, నీటి సంఘాల ప్రతినిధులు అప్పటి వై . సీ.పీ ప్రభుత్వంపై 9714 రిట్ పిటిషన్లు, 6625 కోర్టు ధిక్కార పిటిషన్లు వేయగా ఎన్.డి.ఎ. ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేనాటికి సి.ఎఫ్.ఎం.ఎస్. టోకెన్ పడిన వాటిలో రు.964 కోట్లు చెల్లించగా ఈ వార్షిక బడ్జెట్ లో రు.660 కోట్లు కేటాయించి ఎన్.డి.ఎ. ప్రభుత్వం ఏర్పడిన తరువాత రు.340 కోట్లు చెల్లించగా ఇంకనూ రు.320 కోట్లు చెల్లించవలసి వుంది.
ఈ చెల్లింపులకు ప్రస్తుతం సి.ఎఫ్.ఎం.ఎస్.లో సాంకేతిక సమస్య కారణంగా బిల్లులు అప్ లోడింగ్ సమస్యతో పెండింగ్ లో వుండగా ఈ విషయాన్ని ఈరోజు సాయంత్రం విజయవాడ ఎం.జి. రోడ్డులోని జలవనరుల శాఖ క్యాంపు కార్యాలయంలో మంత్రివర్యులు డా॥ నిమ్మల రామానాయుడుగారిని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు, నాగార్జునసాగర్ ఎడమకాలువ ప్రాజెక్టు కమిటీ వైస్ ఛైర్మన్ ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు నేతృత్వంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్లు పామర్తి శ్రీనివాసరావు, కొమ్మారెడ్డి రాజేష్, దేవినేని సత్యనారాయణ తదితరులు కలిసి పెండింగ్ లో ఉన్న నీరు-చెట్టు బకాయిలను రైతులకు చెల్లించటానికి చర్యలు తీసుకోవాలని పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించారు.
దీనిమీద మంత్రి స్పందిస్తూ ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి నీరు-చెట్టు పెండింగ్ బిల్లులు చెల్లించటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అట్లాగే నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఆంధ్ర ప్రదేశ్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి 12 టి.ఎం.సి.లు విడుదల చేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు గత డిసెంబరులో ఉత్తర్వులు ఇచ్చినప్పటికి ఇప్పటివరకు 7 టి.ఎం.సి.లు మాత్రమే విడుదల చేసి 3వ జోన్ కు అరకొరగా 500, 600 క్యుసెక్కులు మాత్రమే ఇవ్వటంవలన 3వ జోన్ లో ఉమ్మడి కృష్ణాజిల్లా నూజివీడు, గన్నవరం, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజక వర్గాల్లో 2.36 లక్షల ఎకరాల్లో ఆయకట్టుదారులు సాగుచేసిన మిర్చి, పత్తి, పొగాకు, జొన్న, మొక్కజొన్న, మామిడి తదితర ఆరుతడి పంటలు ఎండిపోతున్నాయని ఈ పంటలను రక్షించటానికి వెంటనే చర్యలు తీసుకుని సాగర్ 3వ జోన్ కు సాగునీటిని విడుదల చేయించాలని మంత్రి డా॥ నిమ్మలకు విజ్ఞప్తి చేయగా ఆయన స్పందిస్తూ ఈ విషయాన్ని సంబంధిత తెలంగాణ ఉన్నత అధికారులతో మాట్లాడి ఈ వారంలోనే 3వ జోన్ కు సాగర్ నీటిని విడుదల చేయించటానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.