తెలుగు వర్సిటీకి వెలుగు తేవడంలో మంత్రి దుర్గేష్ చొరవను కొనియాడుతున్న భాషాభిమానులు, సాహితీవేత్తలు, పండితులు, గోదావరి జిల్లాల ప్రజలు
చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధానికి విశ్వవిద్యాలయ సాధనపై కేబినెట్ దృష్టికి మంత్రి దుర్గేష్ అనేక ప్రతిపాదనలు
ఎట్టకేలకు రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదంపై మంత్రి కందుల దుర్గేష్ హర్షం
తూర్పుగోదావరి జిల్లా ప్రజల తరపున సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం/అమరావతి:తెలుగు సాహిత్యం, సాంస్కృతిక వైభవం విరాజిల్లిన రాజమహేంద్రవరానికి తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అభినందనీయమని పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు, గోదావరి జిల్లాల ప్రజలు కొనియాడుతున్నారు. గత ప్రభుత్వం ఈ సాహిత్య పీఠంపై దృష్టి పెట్టకపోవడంతో శిథిలావస్థకు చేరుకొని చీకటి సంతరించుకున్న నేపథ్యంలో చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధాని రాజమహేంద్రవరానికి వెలుగులు తెచ్చేందుకు విశ్వవిద్యాలయ సాధనకు తనదైన శైలిలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన విశ్వ ప్రయత్నాలకు మార్గం సుగమం అయింది.
విశ్వవిద్యాలయ ఆవశ్యకతను పలుమార్లు కేబినెట్ దృష్టికి తీసుకెళ్లి విజయవంతం కావడంలో సఫలీకృతులయ్యారు. మంత్రి కందుల దుర్గేష్, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారం వల్ల రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ చేసిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపడంతో
ఎట్టకేలకు రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రధాన కేంద్రం పునరుద్ధరణకు నోచుకోనుంది. రానున్న రోజుల్లో తెలుగు భాష, సాహిత్య సంస్కృతుల పరిరక్షణకు నిలయంగా ఈ విశ్వవిద్యాలయం పనిచేయనుంది. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటమే గాక వారి నైపుణ్యాలను మెరుగుపర్చుకునే అవకాశముంది.
రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రంలో తెలుగు విశ్వవిద్యాలయం ఉనికి కోల్పోవడంతో తిరిగి వర్సిటీని సాధించేందుకు మంత్రి కందుల దుర్గేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈ సందర్భంగా గోదావరి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన మంత్రి కందుల దుర్గేష్ ను పలువురు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు కళలకు పూర్వ వైభవం వస్తుందనే అభిప్రాయం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతుండటం శుభ పరిణామం. ఎందరో పండితులను తీర్చిదిద్దిన బొమ్మూరులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి మంచి రోజులు ప్రారంభమయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ ఆవశ్యకతను పరిగణలోకి తీసుకొని తమ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపేందుకు కృషి చేసిన సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా శాఖ మంత్రి నారాలోకేష్ లకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.