సృష్టిలో ప్రతీదీ జీవరాసుల మనుగడకు భగవంతుడు ఇచ్చిన కృప కాగా జీవశక్తిని అందించే ఆహారంలో కాయగూరలు పాత్ర ప్రముఖమైనదని,ఆరోగ్య సిరులు అందించే ప్రకృతి వరాలు కూరగాయలని ప్రముఖ వెజిటబుల్ థేరపిస్ట్,సన్ స్పిరిట్యు వల్ సొసైటీ వ్యవస్థాపకులు విక్రమాదిత్య తెలిపారు.
ది జంగారెడ్డిగూడెం పిరమిడ్ స్పిరిట్యువల్ సొసైటీ నిర్వహణలో ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం పట్టణంలోని శేషాద్రి నగర్ శ్రీగౌరీ సుభద్ర పిరమిడ్
ధ్యానమందిర అనుబంధ మైత్రేయ మందిరంలో ఆదివారం ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకూ జరిగిన మహా ఆరోగ్య అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని కాయగూరల వాడకం ద్వారా ఆరోగ్య పరిరక్షణ అనే అంశంపై ప్రధానోపన్యాసం చేస్తూ అవగాహన కలిగించారు. జీవించడం కోసం ఆహారం స్వీకరించాలని,ఆహారం స్వీకరణ కోసమే జీవితం అన్నట్లుగా మనుగడ సాగించడం ప్రమాదకరమని,వ్యక్తి ఆరోగ్యం ప్రధానంగా ఆహారంపైనే ఆధారపడి ఉంటుందని తీసుకునే ఆహారం మితంగా హితంగా ఉన్నా పోషకవిలువలు కలిగిఉండటం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాలు అందిస్తామని విక్రమాదిత్య తెలిపారు.
రోగాలకు మూలకారణం జీవనవిధానం పట్ల ఆసక్తి చూపకపోవడమేనని ప్రకృతి అందించిన కాయగూరలు వినియోగం పట్ల సరైన అవగాహన కలిగిఉంటే రోగాలు దారిచేరాకుండా ఉల్లాసంగా సంతోషంగా జీవించవచ్చని,కేవలం పది గోరుచిక్కుళ్ళు తీసుకోవడం మాంసకృత్తులకు ప్రత్యామ్నాయం అని ఇదే రీతిలో బూడిదగుమ్మిడికాయ నుండి సమస్త కూరగాయలు వాడకం వాటి పనితీరు వివరించడంతో పాటు రాసులను బట్టి ఏ రాశివారు, ఏ కూరగాయలు, కాషాయాలు ఎలా వాడాలో విక్రమాదిత్య సోదాహరణంగా వివరించారు.
మనం నివసించే ప్రాంతాల్లో లభ్యమయ్యే కాయగూరలు,పళ్ళు వినియోగం మించిన జ్ఞానం ఆహార స్వీకరణలో మరోటి లేదని,సూర్యశక్తి,చంద్రశక్తిలో ఉండే ఔషధ గుణాలను గురించి వివరిస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముక శర్మ లు అందించిన ఆదిత్యహృదయం ప్రవచనం తన జీవన గమనాన్ని గొప్ప మలుపు తిప్పిందని,సూర్యనారాయణమూర్తి అందించే దివ్యశక్తి, చంద్రుడు అందించే ఔషధీశక్తి గురించి తెలుసుకుని ఆచరణ ద్వారా వేసిన అడుగులకు తమ గురువు అనుగ్రహం తోడై ఈరోజు విక్రమాదిత్యగా మీముందుకు రాగలిగానని శ్రీనివాసరెడ్డిగా నా ప్రస్థానం విక్రమాదిత్య గా రూపాంతరం చెంది ఎందరికో సేవని అందించే అవకాశం ఇచ్చిందని విక్రమాదిత్య అన్నారు. పిరమిడ్ ట్రస్ట్ అధ్యక్షులు కాకి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్యదర్శి తటవర్తి కృష్ణ ఆధ్వర్యంలో పిరమిడ్ ట్రస్ట్ ప్రతినిధులు విక్రమాదిత్య కు స్వాగతం పలికారు. కొలనువాడ శిరీష స్వాగతోపన్యాసం చేయగా పాలడుగుల సురేష్ సదస్సులో వందనసమర్పణ అందించారు.
ప్రకృతి అందించిన వరాలైన కూరగాయలతో తయారుచేసిన ప్రత్యేకశిబిరం పిరమిడ్ ట్రస్ట్ ఏర్పాటు చేయగా విక్రమాదిత్య ప్రారంభించారు.జంగారెడ్డిగూడెం లోని అన్నిరంగాల ప్రముఖులు,ఆరోగ్యాభిలాషులు, ధ్యానులు,ఆధ్యాత్మిక మరియు ధార్మిక మార్గంలోని వారు పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు పాల్గొన్నారు