Subscribe Us

header ads

ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.

 



ఏపీ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.

పవన్ కల్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ ల నాయకత్వంలో పని చేస్తా.

మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తా.

-ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ 

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబునాయుడుతోనే సాధ్యమని, తెలుగుదేశం- జనసేన సారధ్యంలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో మైలవరం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ రెండు మూడు రోజులలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మాజీమంత్రి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగతమైన విభేదాలు ఏమీలేవన్నారు. రాజకీయ పరంగానే పరిస్థితులు మా ఇద్దరి మద్య మారాయన్నారు. ఇప్పటి వరకూ పార్టీల పరంగా చెరోదారి అయినప్పటికీ, ఇకపై ఇద్దరం కలిసి ఒకే పార్టీలో పనిచేయాల్సి ఉందన్నారు. మైలవరం అభ్యర్థిత్వంపై అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తనవల్ల తెలుగుదేశం పార్టీకి మంచే జరుగుతుందన్నారు. పార్టీ విధానాల మేరకు  అందరితో కలిసి పనిచేస్తానన్నారు. ఇరు పార్టీల ముఖ్య నేతలను నేటి నుండి కలిసి వారి సలహాలు సూచనాలతో ముందుకెళతానన్నారు. అందరినీ కూడా త్వరలోనే కలుస్తానన్నారు.

ఇప్పటి వరకు తన భావసారూప్యత నచ్చి, నాతో కలిసి నడిచిన వైసీపీ ముఖ్య నేతలతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను నాతో కలిసి పని చేయడానికి ఆహ్వానిస్తున్నట్లు కోరారు. నేటి నుండి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో పాటు తన పనితీరు నచ్చిన వైసీపీ నాయకులను కూడా 5 మండలాల్లో కలుస్తానన్నారు.

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పరిపాలన సాగాలని అన్నారు. అభివృద్ధి పనులు జరగక, గ్రామాల్లో మౌలిక వసతులు లేక సామాన్య ప్రజలు ఎన్నో అవస్థలకు గురవుతున్నారన్నారు. ఎస్సీ, బీసీ ఏరియాల్లో డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చాలామంది తల్లులు అడిగారని అన్నారు. ఇది ప్రతి గడపలో ఎదురైందన్నారు. పరిశ్రమలు లేక సరైన ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ సమస్యరాజ్యమేలుతోందన్నారు. ఇది మరింత జఠిలమైతే అందరి భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారుతుందన్నారు. ముందుచూపుతో ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా, పేదల కుటుంబాలు సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా పరిపాలన ఉండాలన్నారు.ఏపీ రాజధాని అమరావతి విషయంలో కూడా వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. అమరావతి రాజధాని వద్దు అని గత కొంతకాలంగా అక్కడి వారు కొందరు దీక్షలు చేస్తున్నారంటే దాన్ని ఏ కోణంలో చూడాలని ప్రశ్నించారు. అమరావతి రాజధాని ప్రాంతంలోని పేదలను పావులుగా చూపి వారితో వెయ్యి రోజులు దీక్షలు చేయించి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు. మా ప్రాంతానికి అభివృద్ధి వద్దని పేదలతో అనిపించడం ఇది ఏ భావజాలం అని ప్రశ్నించారు. అధిష్టానం నిర్ణయాలలో లోపాలను ఎత్తిచూపితే, వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని విషయంలో జరుగుతున్న లోపాన్ని ఎత్తిచూపితే తనను తప్పు పట్టారని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతాలు కూడా ఎంతో అభివృద్ధి చెంది పేదలు కూడా కోటీశ్వరులయ్యారని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ లను తిట్టిన వారికే పార్టీలో పెద్దపీట వేస్తున్నారన్నారు. ఇళ్లపై దాడులు చేస్తే, వ్యక్తిగత దూషణలు చేస్తే వచ్చే ఉన్నత పదవులు తనకు అవసరం లేదన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు అందరూ పేదలను బాగుచేయాలని, వారి అభివృద్ధికి, సంక్షేమం కోసం పాటు పడాలన్నారు. అంతే కానీ పేదలపై పెత్తనం చేసి వారిని బానిసలుగా చూడటం తప్పు అన్నారు. దిగజారుతున్న రాజకీయ విలువలను రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జనసేన, తెలుగుదేశంతో పాటు బీజేపీ కూడా కలసే అవకాశం ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఈ కూటమి విజయం సాధిస్తుందని అన్నారు. ఏపీ అభివృద్ధికి అగ్రనేతలు అంతా కృషి చేస్తారని అన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామన్నారు.