Subscribe Us

header ads

బలివే బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి:మంత్రి పార్థ సారధి


ఏలూరు/ముసునూరు:బలివే బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలనీ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అధికారులను ఆదేశించారు. ముసునూరు మండలం బలివే లో తమ్మిలేరు పై 16 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను శనివారం సాయంత్రం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారధి మాట్లాడుతూ తమ్మిలేరు వరద సమయంలో తమ్మిలేరుకు అటువైపు ఉన్న విజయరాయి కి వెళ్లే విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలకు రాకపోకలు స్తంభించాయన్నారు. బ్రిడ్జి నిర్మాణంలో రెండు స్లాబులు ఇంకా నిర్మించవలసి ఉందని, ప్రస్తుతం వర్షాలు, వరదలు తగ్గి, వాతావరణం అనుకూలించిన తరువాత వాటి నిర్మాణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నిర్మాణం పూర్తి అయ్యేలోగా విద్యార్థులు, ప్రజలు తమ్మిలేరుకు అటువైపు వెళ్లేందుకు కేవలం పాదచారులు వెళ్లేందుకు స్లాబుల స్థానంలో ప్రమాదం లేని విధంగా ఇనుప బెయిలీ షీట్లు ఏర్పాటుచేయాలన్నారు. తమ్మిలేరుకు ఆవలి వైపు ర్యాంపు, తదితరాలు నిర్మాణం నిమిత్తం ప్రైవేట్ స్థలం సేకరించవలసి ఉందని, వారితో తాను స్వయంగా ఫోన్ లో సంప్రతించి ఒప్పించడం జరిగిందన్నారు. సదరు భూ సేకరణకు సంబంధించి రెవిన్యూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. ముసునూరు మండలంలో రోడ్లు, త్రాగునీరు, తదితర మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటుచేస్తానని మంత్రి చెప్పారు. 2014 తరవాత తెలుగుదేశం ప్రభుత్వ సమయంలో ఇళ్ళు మంజూరైన లబ్దిదారులకు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని, స్వంత స్థలంలో శంఖుస్థాపన చేసి, పునాదులు నిర్మించుకున్నవారికి కూడా ఇల్లు మంజూరు ఉత్తరువులు ఇవ్వని కారణంగా వారు ఇల్లు నిర్మించుకోలేకపోయారన్నారు. వారందరికీ బిల్లులు చెల్లిస్తామని, పునాదులు నిర్మించుకున్నవారికి కొత్తగా ఇల్లు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో నూజివీడు ఆర్డీఓ వై. భవానీశంకరి, ఇరిగేషన్ ఎస్ఈ దేవ ప్రకాష్,, డీ ఈ వై. అర్జునరావు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.