Subscribe Us

header ads

సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలి.


మంజీరగళం ప్రతినిధి :భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు... బుధవారం జిల్లా కలెక్టరేట్ లో ఎంపీడీవోలు,తహసీల్దార్లతో శాఖల వారీగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం గ్రామ పంచాయతీల వారీగా ఓటరు జాబితాలను సకాలంలో సిద్ధం చేయాలని, ఇప్పటివరకు జిల్లాలో ఆశించిన స్థాయిలో పని జరుగుతుందని అన్నారు.జాబితా తయారీలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలన్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల పరిధిలో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. వారంలో రెండుసార్లు తప్పకుండా శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. డెంగ్యూ, చికెన్ గునియా,వైరల్ ఫీవర్స్ ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. గ్రామాలలో తక్కువ ఖర్చుతో ప్రత్యేక ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని, నిర్దేశించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. వెనుకబడిన మండలాలపై దృష్టి సారించాలన్నారు.
 
 ఈనెల 31 వరకు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి కోనోకార్పస్ మొక్కలను తొలగించి వాటి స్థానంలో పగోడా తదితర మొక్కలను నాటించాలని అధికారులకు చెప్పారు. అమ్మ ఆదర్శ పాఠశాలల పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని, వాటి లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యశాఖ అధికారులు, సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని చెప్పారు. జిల్లాలో మందుల కొరత ఉన్నదని తన దృష్టికి వచ్చిందని దీని విషయంలో అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల విషయంలో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే వాటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ విద్యాచందన, డిపిఓ చంద్రమౌళి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.