(మంజీర గళం) ప్రతినిధి :ఏలూరు.
ఆరోగ్యకరమైన భవిష్యత్ వైపు నడిపించేందుకు ఫిట్ ఇండియా దోహదం. ఈనెల 29వ తేదీన నిర్వహించే 3కె రన్ లో అందరూ భాగస్వామ్యం కావాలి. ఉల్లాసంగా, ఉత్సాహంగా క్రీడా పోటీల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జెసి పి. ధాత్రిరెడ్డి. ఏలూరుజిల్లా ప్రజలు తమ రోజువారీ జీవితంలో శారీరక వ్యాయామం, క్రీడలను అభ్యాసం చేసి ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ ఈనెల 29వ తేదీన పుట్టిన రోజు సందర్బంగా వారం రోజుల పాటు నిర్వహిస్తున్న క్రీడోత్సవాల్లో భాగంగా బుధవారం స్ధానిక ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీలను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ప్రారంభించారు. ఈ సందర్బంగా చురుకైన మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవడానికి నా ఫిట్‌నెస్ మరియు ఆరోగ్యం కోసం ప్రతిరోజూ 30 నిమిషాలు కేటాయిస్తానని నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగువారిని ఫిట్‌గా మరియు ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహిస్తానని క్రీడాకారులు, ప్రజలతో కలెక్టర్ ప్రతిజ్ఞ నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ పుట్టినరోజు సందర్బంగా జిల్లా వ్యాప్తంగా వారం రోజులపాటు క్రీడోత్సవాలు నిర్వహించుకుంటున్నామన్నారు. అందులో భాగంగా పాఠశాలలు, హాస్టల్స్, కళాశాలల్లో విద్యార్ధులను భాగస్వామ్యం చేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఫిట్ ఇండియా ప్రతిజ్ఞ కూడా తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈనెల 26 నుండి 29 వరకు పలు క్రీడా పోటీలు నిర్వహించుకుంటున్నామని అందులో అధికారులు, ప్రజలు తప్పనిసరిగా పాల్గొవాలన్నారు. ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా ఏలూరు నగరంలో 3 కె రన్ కూడా నిర్వహిస్తున్నామని అందులో కూడా నగర ప్రజలందరూ పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఉత్సాహంగా, ఉల్లాసంగా క్రీడాపోటీల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జెసి.
స్ధానిక ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహించిన పలు పోటీల్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. వాక్ రన్, షటిల్ పోటీల్లో వారు పాల్గొని అందరిలో క్రీడా స్పూర్తిని పెంపొందించారు. అనంతరం లెమన్ టీ స్పూన్ పోటీలను వారు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, డిఎస్ డివో బి. శ్రీనివాసరావు, డిపివో టి. శ్రీనివాస విశ్వనాధ్, ఐసిడిఎస్ పిడి కె. పద్మావతి, బి.సి. సంక్షేమ అధికారి ఆర్. నాగరాణి, డిసిపివో సూర్య చక్ర వేణి, వివిధ శాఖల అధికారులు, క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు.