గన్నవరం :-
గన్నవరం నియోజకవర్గం లోని వరద బాధితులు అందరికీ ప్రభుత్వం నుంచి పరిహారంతో పాటు నిత్యావసర సరుకులు వెంటనే అందచేయాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తహసిల్దార్లను ఆదేశించారు. బుధవారం రాత్రి గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్, గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు మండల తాహసిల్దారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద నష్టం జరిగిన గ్రామాల్లో ఎన్యూమరేషన్ జరుగుతున్న తీరు, బాధితులకు నిత్యావసరాలు పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పంట నష్టం వివరాలు నమోదు పక్కాగా జరగాలన్నారు. నష్టపోయిన బాధితులు అందరి వివరాలు నమోదు చేయాలని సూచించారు.
కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న నిత్యావసర సరుకులు బాధితులందరికీ అందటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని తక్షణమే పునఃపరిశీలన చేసి బాధితులు అందరికీ నిత్యవసర సరుకులు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. ఏ ఒక్క బాధితుడు తనకు పరిహారం, నిత్యావసరాలు అందలేదని ఫిర్యాదు రాకుండా పక్కాగా పంపిణీ జరగాలని యార్లగడ్డ ఆదేశించారు. అదేవిధంగా వరదనీటిలో మునిగి దెబ్బతిన్న మోటారు సైకిళ్ళు, కార్లు, ఇతర మోటార్ వాహనాల వివరాలు నమోదు చేయాలని సూచించారు.