Subscribe Us

header ads

నూజివీడు వరదముంపు ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్.


 ఏలూరు/నూజివీడు:

వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పారిశుధ్య పనులను మరింత మెరుగుపరచాలి. ఏలూరుజిల్లా వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఆదివారం నూజివీడు వెలమపేట, పెట్రోల్ బంక్, తిరువూరు రోడ్డు లారీ యూనియన్ ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి పర్యటించారు. తొలుత స్ధానిక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయబడిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ బాధితులకు ఏర్పాటు చేసిన వసతి, భోజన సౌకర్యాలను పరిశీలన చేశారు. పునరావస కేంద్రంలో ఉన్న ప్రజలతో వారికి ఏర్పాటు చేసిన విషయాలపై ఆరా తీశారు. నూజివీడు పట్టణంలోను పునరావాస కేంద్రాల వద్ద ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. వెలమపేట వరద నీరు వచ్చిన కారణంగా శిధిలావస్ధలో వున్న గృహాల్లో ఉంటున్న కుటుంబాలను పునరావాస కేంద్రానికి రావాలని సూచించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ వెలమపేటలోని ఇళ్లను పరిశీలించి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను, శిధిలావస్ధలోవున్న గృహాల్లో నివశిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు చేర్చాలని సంబంధిత రెవిన్యూ, పోలీసు అధికారులను ఆదేశించారు.

శిధిలావస్ధలోవున్న గృహంలో నివసిస్తున్న సరోజిని అనే వృధ్దురాలిని వెంటనే పునరావస కేంద్రానికి రావాలని కలెక్టర్ కోరారు. వంటరిగా ఉన్న వారిని తప్పనిసరిగా పునరావాస కేంద్రానికి వచ్చేలా నచ్చజెప్పాలని సంబంధిత అధికారులను, సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. అక్కడ ఉన్న 7వ తరగతి చదువుచున్న టి. వివేక్, సిహెచ్ రమేష్ లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పలకరిస్తూ అధిక వర్షాలు పడుతున్నందున బయట తిరగవద్దని, ఇంటిలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. వారిని చదువుకుని ఏమిచేస్తారని ప్రశ్నించగా వివేక్ పైలెట్ అవుతానని చెప్పడంతో అయితే మనకొక పైలెట్ వస్తాడని చిరునవ్వుతో కలెక్టర్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి మాట్లాడుతూ భారీవర్షాలు మూలంగా దెబ్బతిన్న ఇళ్ల వివరాలను వెంటనే పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  
 వీరి వెంట నూజివీడు ఆర్డిఓ వై. భవానీశంకరి, మండల ప్రత్యేక అధికారి, ఉధ్యానశాఖ డిడి రామ్మోహన్, మున్సిపల్ కమీషనరు, స్ధానిక రెవిన్యూ, పోలీస్ అధికారులు ఉన్నారు.