మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో నిర్వహించిన తొలి మ్యాచ్ లో ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల జట్టుపై కేరళ టీం విజయం
ఉత్కంఠంగా సాగిన రెండో మ్యాచ్ లో కర్ణాటక జట్టుపై గెలిచిన తమిళనాడు టీం
ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లు.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన యువ క్రీడాకారులు
ఇండియన్ ఆడిట్స్ మరియు అకౌంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13వ తేదీ వరకు 4 రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహణ
విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో తొలిసారి నిర్వహిస్తోన్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్..
ఆంధ్రాలో తొలిసారిగా ఈ పోటీలు ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొన్న సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ భాస్కర్ కల్లూరు
మంగళగిరి: మంగళగిరి ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ -2025 ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్సెస్ కేరళ, తమిళనాడు వర్సెస్ కర్ణాటక మధ్య రెండు మ్యాచ్ లు ఆద్యంతం ఆసక్తిగా జరిగాయి. ఐపీఎల్ తరహాలో క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను మైదానంలో ప్రదర్శించారు.
క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా పోటీల్లో పాల్గొనేందుకు రెండు ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోన్న జట్లు, దాదాపు 80 మంది క్రీడాకారులు మంగళగిరి స్టేడియానికి చేరుకున్నారు. సోమవారం ఉదయం 9 గం.లకు ఆడిట్ జనరల్ కార్యాలయం సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్స్ భాస్కర్ కల్లూరు, కిషోర్ రెడ్డి, ఆర్. శ్యామ్, రాకేష్ నాయక్, ఎన్. నిఖిలలు జెండా ఊపి టోర్నమెంట్ ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వాహకులు, విజయవాడ ఆడిట్ జనరల్ కార్యాలయం సీనియర్ డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ భాస్కర్ కల్లూరి మాట్లాడుతూ నిరంతరం తమ పనిలో నిమగ్నమై ఉంటున్న ఉద్యోగులు ఈ క్రికెట్ పోటీలు ఆటవిడుపుగా ఉంటాయని తెలిపారు.
మంగళగిరిలోని ఏసీఏ ఇంటర్నేషనల్ స్టేడియంలో ప్రతిష్టాత్మక ఐఏ అండ్ ఏడీ సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.. విజయవాడలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నేతృత్వంలో తొలిసారి నిర్వహిస్తోన్న సౌత్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ ఇది అని అన్నారు. క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనవలసిందిగా కోరారు. మంగళగిరి స్టేడియం క్రీడలకు అద్భుతమైన వేదికగా నిలిచిందన్నారు. ఈ స్టేడియంకు వచ్చే అప్రోచ్ రోడ్ల నిర్మాణాలు చేపడితే మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి రాష్ట్రంలో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ ల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులకు రంజీ, ఐపీఎల్ వంటి టోర్నీల్లో పాల్గొనే అవకాశం దక్కుతుందన్నారు.
టోర్నమెంట్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ టీమ్ ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కర్ణాటకపై తమిళనాడు జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత టాస్ గెలిచిన కేరళ టీం మొదట బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ చేపట్టిన ఆంధ్రప్రదేశ్- తెలంగాణ జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది.. ఆంధ్ర, తెలంగాణ జట్టుకు చెందిన రవితేజ 40, యష్ కొటారి 26 పరుగులు చేశారు. కేరళ జట్టుకు చెందిన బౌలర్ అంకిత్ మిశ్రా నాలుగు ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు. కార్తికేయ 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. అనంతరం 97 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కి దిగిన కేరళ జట్టు కేవలం 18.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులతో లక్ష్యం పూర్తి చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జట్టుపై ఘన విజయం సాధించింది.
కేరళ జట్టులో మహమ్మద్ షన్ను 49 బంతులలో 43 పరుగులు చేశారు. శాలీ శ్యామ్సన్ 25 పరుగులు చేశారు. బౌలింగ్ విభాగంలో ఆంధ్రా, తెలంగాణకు జట్టుకు చెందిన రవితేజ 1 వికెట్ తీసి 9 పరుగులు సమర్పించుకున్నారు. సన్నీ 1 వికెట్ తీసి 15 పరుగులు ఇచ్చారు.
టోర్నమెంట్ లో భాగంగా రెండో మ్యాచ్ తమిళనాడు, కర్ణాటకల మధ్య ఆద్యంతం ఉత్కంఠంగా సాగగా చివరికి కర్ణాటకపై తమిళనాడు జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. తొలుత తమిళనాడు జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా మొదట బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టు నిర్దేశిత 20 ఓవర్లలో 4 వికెట్ల కోల్పోయి 169 పరుగులు చేసింది. కర్ణాటక జట్టు బ్యాట్స్ మెన్ లు హెచ్. అర్జున్ 47 పరుగులతో అజేయంగా నిలవగా శరత్ బీఆర్ 23 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్స్ తో 40 పరుగులు చేశారు. కర్ణాటక జట్టు కెప్టెన్ జె సుచిత్ 16 బంతుల్లో రెండు సిక్స్ లు, రెండు ఫోర్లతో 31 పరుగులు తీసి నాటౌట్ గా నిలిచారు. తమిళనాడు జట్టు బౌలర్లు విఘ్నేష్, అశ్విన్ బాలాజీ, పాండియా రాజ్ ఒక్కో వికెట్ తీశారు. తమిళనాడు రాష్ట్ర జట్టు 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి చివరి ఓవర్ చివరి బంతి వరకు ఉత్కంఠంగా సాగిన పోరులో గెలిచింది.
చివరి ఓవర్ లో ఆరు బంతులకు 8 పరుగులు తీయాల్సి ఉండగా ఐదు బంతుల్లో ఏడు పరుగులు తీసి మ్యాచ్ ను టై చేశారు. చివరి బాల్ ను బాట్స్ మెన్ ఎంతో చాకచక్యంగా బైస్ రన్ తీయటంతో మ్యాచ్ ను గెలుపొందారు. తమిళనాడు జట్టులో వేదాంత్ భరద్వాజ్ 57 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ లతో 83 పరుగులు చేసి మ్యాచ్ ను విజయతీరాలకు చేర్చాడు. విఘ్నేష్ 27 పరుగులు చేసి మ్యాచ్ కు వెన్నుదన్నుగా నిలిచారు. కర్ణాటక బౌలర్స్ దర్శన్ 2 వికెట్లు తీసి 13 పరుగులు ఇవ్వగా, జై 2వికెట్లు పడగొట్టి 31 రన్స్ ఇచ్చారు.
మంగళవారం ఉదయం 9 గం.లకు ఆంధ్ర - తెలంగాణ జట్టు, తమిళనాడు జట్ల మధ్య, అనంతరం మధ్యాహ్నం 1 గం.ల నుండి కేరళ, కర్ణాటక రాష్ట్రాల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.
కార్యక్రమం ప్రారంభమైన అనంతరం ఆంధ్రప్రదేశ్ తరపున జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నీలం మణి శ్రావణిని నిర్వాహకులు అభినందించి బహుమతి అందజేశారు. గతంలో కామన్ వెల్త్ పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ సర్టిఫికేట్ పొందడమే గాక ఆక్లాండ్ లో జరిగిన 84 ఫ్లస్ కేజీల ఈక్విప్ప్డ్ పవర్ లిఫ్టింగ్ క్లాస్ సబ్ జూనియర్ కోటాలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రావణి జాతీయ, అంతర్జాతీయ ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రభుత్వాలు, ప్రఖ్యాత వ్యక్తులు, సంస్థలు నుండి బహుమానాలు, ప్రశంసలు అందుకున్నారు..