Subscribe Us

header ads

స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలి


 ఆహార అలవాట్లు మారాయి....అగ్రికల్చర్ స్థానంలో హార్టికర్చల్ వచ్చేస్తోంది

హార్టికల్చర్ సాగుకు, ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు మద్దతుగా నిలవాలి

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదు...దీనికోసం బ్యాంకులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి

ఎంఎస్ఎఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేసింది...బ్యాంకులు సహకరించాలి 

గత ప్రభుత్వ అక్రమాలపై విచారణల్లో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలి

పిఎం సూర్యఘర్ పథకం కింద ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సోలార్ విద్యుత్ లక్ష్యం

ఎస్ఎల్ బిసి సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
 

అమరావతి: స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్‌లను కోరారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని సిఎం అన్నారు. 15 శాతం వృద్ధిరేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని...వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని సీఎం అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఎక్కవ వృద్ధి సాధించే అవకాశం ఉందని...దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని సిఎం కోరారు.

 దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని...దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందని అన్నారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికర్చల్ సాగు వస్తుందని...దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగుచేసే రైతులకు బ్యాంకులు సాయపడాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చిన 15 నిముషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి కుటుంబంలో రెండు మూడు పశువులు లేదా కొన్ని జీవాలు ఉంటే మంచి ఆదాయం వస్తుందని....డైరీ రంగాన్ని పోత్సహించడం తమ విధానమని సీఎం అన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసేపరిస్థితి వస్తోందని....దీన్ని నివారించేందుకు బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రొడక్ట్ ఫర్ ఫెక్షన్ పైనా తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని.....పంటలు, ఉత్పత్తులకు విలువ పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నాం అన్నారు.

ప్రకృతి సేద్యం గేం ఛేంజర్:

బ్యాంకులు అంటే రుణాలు మాత్రమే కాదు....సాగులో కొత్త విధానాలను ప్రోత్సహించేలా పనిచేయాలని సీఎం అన్నారు. పంజాబ్ వంటి రాష్ట్రంలో విపరీతంగా పురుగుమందుల వాడకం వల్ల క్యాన్సర్ బాధితులు పెరిగి వైద్యం కోసం ఢిల్లీ బాటపడుతున్నారని అన్నారు. ప్రకృతి సాగుతోనే వీటికి పరిష్కారం చూపగలం హార్టికల్చర్ సాగుతో పాటు ప్రకృతి వ్యవసాయానికి బ్యాంకులు మద్దతుగా నిలవాలి.
 

రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదు:

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్య మాటే వినిపించకూడదని అన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణకు అవసరమైన మార్గాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు. చనిపోయిన తర్వాత ఇచ్చే పరిహారం కంటే ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం, బ్యాంకర్లు ఏం చేయాలనేదానిపై ప్రత్యేకంగా మేధోమథనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇకపోతే ఎంఎస్ఎఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేసిందని, బ్యాంకులు ఈ విషయంలో మరింత చొరవ చూపాలని సీఎం అన్నారు. ఎంఎస్ఎంఈ లకు తగినప్రోత్సాహం ఇవ్వాలని, ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో మేం పనిచేస్తున్నామని అన్నారు. అది సాకారం కావాలంటూ చిరు వ్యాపారులకు రుణాలు సులభతరం కావాలి అని సిఎం అన్నారు.

దర్యాప్తు సంస్థలకు సహకరించండి:

గత ప్రభుత్వ విధ్వంస పాలనలో అన్ని విభాగాలు, రంగాలు దెబ్బతిన్నాయని...వాటిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని..దీనికి బ్యాంకుల సహకారం ఎంతో కీలకం అని సిఎం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆయా శాఖల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేస్తోందని...ఈ విచారణకు బ్యాంకు నుంచి కొంత సమాచారం కూడా అవసరం అవుతుందన్నారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో బ్యాంకులు దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇచ్చి సహకరించాలని సిఎం సూచించారు. 

ఏడాదిలో 20 లక్షల ఇళ్లకు సౌర విద్యుత్:

కేంద్ర పథకాలను అందిపుచ్చుకుని ప్రజలకు మేలు చేయాలనే సంకల్పానికి బ్యాంకులు మద్దతుగా ఉండాలని సిఎం అన్నారు. పిఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందిచాలని లక్ష్యం విధించుకున్నామన్నారు. ‘2 కిలో వాట్ల వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ పరికరాలు అందిస్తాం. ఈ కార్యక్రమం అమలు ద్వారా అనూహ్య ఫలితాలు వస్తాయి. ప్రజలకు ఉపయోగపడే ఈ పథకం అమల్లో బ్యాంకులు కూడా భాగస్వామ్యం అవ్వాలి. ఈ పథకం ద్వారా ఉచితంగా తమ అవసరాలకు విద్యుత్ పొందడమే కాకుండా...తమ ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో ప్రజలు ఆదాయం పొందే అవకాశం ఉంది’ అని సిఎం అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయని...వాటికి బ్యాంకులు రుణాలు ఇచ్చి సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ సమావేశంలో మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, కొండపల్లి శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ సీఈఓ మనిమేఖలై, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.  



వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.... ఏపీ అభివృద్ధిలో వ్యవసాయ, అనుబంధ రంగాలు గ్రోత్ ఇంజన్‌లుగా ఉన్నాయి. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 20 శాతం వృద్ధి సాధించాలని సీయం నిర్దేశించారు. గత ఏడాదితో పోలిస్తే కౌలు రైతులకు రుణాలు అందించడంలో పరిస్థితి మెరుగ్గా ఉంది. డ్రోన్ల వినియోగానికి బ్యాంకులు రైతులకు సహకారాన్ని అందించాలి. కౌలు రైతులకు సంబంధించి కొంతభూమిలో యజమానికి రుణం ఇచ్చినందున మిగతా భూమికి కౌలు రైతులకు రుణం ఇవ్వడం సాధ్యం కాదని బ్యాంకులు నిరాకరిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. కౌలు రైతులకు కూడా రుణాలు ఇవ్వాలని కోరుతున్నా.’ అని అన్నారు.  


ఆర్థికశాఖా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకుల పాత్ర ఎంతో కీలకమైంది. పేద ప్రజల సంక్షేమానికి మరింత తోడ్పాటును అందించాలి. రాష్ట్ర పునర్నిర్మాణానికి బ్యాంకులు సహకరించాలని కోరుతున్నా. రైతులకు డ్రోన్లు అందించే కార్యక్రమానికి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలకు ఫైనాన్షియల్ లిటరసీపై పూర్తి అవగాహన కల్పించేందుకు బ్యాంకులు కృషి చేయాలి. హెల్, వెల్త్, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో భాగస్వాములు కావాలి’ అని బ్యాంకర్లును కోరారు. 


రాష్ట్ర ఎంఎఎస్ఎంఈ, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ... ఒక కుటుంబం ఒక ఆంట్రప్రెన్యూర్ కార్యక్రమానికి బ్యాంకులు పూర్తిగా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాన. ఎంఎస్ఎంఇ రంగంలో రుణాల కల్పనకు నూతన విధానాన్ని బ్యాంకులు అనుసంరించాలి. ఔత్సాహికులకు తగిన తోడ్పాటును అందించాలని కోరుతున్నా. స్వయం సహాక బృందాలకు పీఎంఈజీపీ కింద తగిన రుణాలు అందించాలి’ అని కోరారు.

 
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మాట్లాడుతూ.... వ్యవసాయ రుణాల మంజూరులో ప్రగతి మెరుగ్గా ఉందని, ఎంఎస్ఎంఇ, స్వయం సహాయక రంగాలకు మరింత పెద్దఎత్తున రుణాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగాల్లో బ్యాంకులు మరింత సహకారాన్ని అందించాలని, ముఖ్యంగా పియం సూర్యఘర్ పథకానికి తగిన తోడ్పాటునిందించాలని కోరారు. రాష్ట్రంలో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల(CBP)ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, వీటి ఏర్పాటులో స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు తోడ్పాటును అందించాలని విజ్ఞప్తి చేశారు.


యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా సీఈఓ, ఎండి ఎ.మణిమేఖలై స్వాగతోపన్యాసం చేస్తూ....ఏపీలో వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఐటి, పారిశ్రామిక రంగాల్లో తగిన అభివృద్ధి కనబడుతోందని, ఇటీవల ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలకు బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 2024-25 బ్యాంకుల వార్షిక రుణ ప్ర్రణాళిక(ACP)అమలుకు సంబంధించి గత డిశంబరు నెలాఖరు నాటికి రూ.5.40 లక్షల కోట్ల రుణాలందించాలని లక్ష్యం కాగా రూ.5.34 లక్షల కోట్ల రుణాలిచ్చి 99 శాతం లక్ష్యాన్ని సాధించినట్టు తెలిపారు. వ్యవసాయ రంగంలో రూ2.64 లక్షల కోట్ల రుణాలు లక్ష్యం కాగా రూ.2.37 లక్షల కోట్లు, ప్రాధాన్య రంగంలో రూ.3.37 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.3.26 లక్షల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎంఎఎస్ఎంఇ రంగంలో రూ.87 వేల కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.79, 905 కోట్లు, ప్రాధాన్యేతర రంగంలో రూ.1.65 లక్షల కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.2.08వేల కోట్లు విడదుల చేసినట్లు తెలిపారు. 


జాతీయ ఎస్సి కమిషన్ డైరెక్టర్ సునీల్ కుమార్‌బాబు మాట్లాడుతూ...బలహీన వర్గాలకు రుణాలు అందించేందుకు మరింత తోడ్పాటును అందించాలని, ముఖ్యంగా ఎంఎస్ఎంఇ, విద్యా రుణాల్లో తోడ్పాటును మెరుగుపర్చాలని కోరారు. ముద్రా, స్టాండ్ అఫ్ ఇండియా వంటి వాటిలో లక్ష్యాలకు అనుగుణంగా రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఆర్బీఐ ఆర్డీఎఓ బషీర్ మట్లాడుతూ...డిజిటల్ పేమెంట్స్, సైబర్ సెక్యురిటీపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. ఈసమావేశంలో నాబార్డు సిజియం ఎంఆర్ గోపాల్, బ్యాకుల రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్లు,వివిధ శాఖల అధికారులు, వర్చువల్‌గా ఎల్డీఎంలు, తదితరులు పాల్గొన్నారు.