రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి
అమరావతి: రాష్ట్ర అభివృద్దిలో అన్ని శాఖల అధికారులను బాగస్వామ్యం చేస్తూ వారికి దశ దిశ నిర్థేశించే విధంగా మరియు రాష్ట్రాభివృద్దికి ఒక దిక్సూచీగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అద్యక్షతన రాష్ట్ర మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖమాత్యులు కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.
మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులను, కార్యదర్శులను కార్యోన్ముఖులుగా చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలను ఈ సమావేశంలో జారీ చేయడం జరిగిందన్నారు. ఫైళ్ల క్లియరెన్సును వేగవంతం చేయాలని, ఫైనాన్స్ కు సంబంధించినవి మినహా మరే ఇతర ఫైళ్లు పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఫైనాస్సుకు సంబందించిన ఫైళ్లను సి.ఎస్.తో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఈ-ఆఫీసు అమలుపై సమీక్షిస్తూ ఈ మాసాంతానికల్లా అన్ని శాఖలు ఈ-ఆఫీసుకు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజల సమస్యలను ఓప్పిగ్గా వినాలని, వారితో దురుసుగా ప్రవర్తించ వద్దని, వారి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ వాటి తక్షణ పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర అభివృద్ధికి "స్వర్ణ ఆంధ్ర @ 2047" విజన్‌ను అనుసరించి 15% వృద్ధి రేటును సాధించడానికి, తలసరి ఆదాయం 42,000 డాలర్లకు పెంచే లక్ష్యంగా ఎటు వంటి చర్యలు చేపట్టాలో మేథోమధనాన్ని తీవ్రతరం చేసి పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని ఆదేశించారన్నారు. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల జిఎస్‌డిపి ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, తలసరి ఆదాయం 42,000 డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో 2025-26 బడ్జెట్ రాష్ట్ర సమగ్రాభివృద్దికి దోహదపడేలా రూపొందించాలని సూచించారన్నారు.
కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులను రాబట్టే విధంగా మంత్రులు, కార్యదర్శులు కృషిచేయాలని సూచించారు. తెలంగాణతో పోలిస్తే జిఎస్‌డిపిలో రూ. 87,000 కోట్ల లోటు ఉందని, కొనుగోలు శక్తిని పెంచాలని పేర్కొన్నారన్నారు. జిఎస్‌డిపి లక్ష్యాలను చేరుకోవడానికి వ్యూహాత్మక విధానం అవసరమనే విషయాన్ని కార్యదర్శులు గుర్తించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో విజన్ మానిటరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసి జిల్లాల ద్వారా నియోజకవర్గ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని, జిఎస్‌డిపి వృద్ధికి దోహదపడే ప్రాజెక్టులను గుర్తించి, వాటిని ప్రత్యేక పోర్టల్ ద్వారా ట్రాక్ చేసే విధంగా ఆలోచన చేయాలన్నారు.
ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరును ముఖ్యమంత్రి సమీక్షిస్తూ ఇంకా రెవెన్యూ, హోం, పంచాయతీ రాజ్, సివిల్ సప్లైస్ విభాగాల్లో పెండింగ్ లో నున్న సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారన్నారు. పెన్షన్ పంపిణీ, అన్న క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు, దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారి సంతృప్తి స్థాయిని తెలుసుకోవడమే కాకుండా వారి సంతృప్తి స్థాయికి దిగువ ఉన్న శాఖలు వాటి పనితీరును మెరుగుపర్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించడం జరిగిందన్నారు.
ప్రభుత్వ ప్రాజెక్టుల సత్వర అమలుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పీఎంజీ (ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ ) విధానాన్ని రాష్ట్రంలోని అన్ని శాఖలు ఈ నెలఖారులోగా అవలంబించాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. దాదాపు రూ.50 కోట్ల పైబడిన ప్రాజక్టును క్షణ్ణంగా ట్రాక్ చేస్తూ ఆ ప్రాజక్టుల సమస్యలను త్వరితగతిన పరిష్కారం లబించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు.
మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ క్రింద ప్రస్తుతానికి దేవాదాయ, రెవిన్యూ, ఇందన, ఏపిఎస్ఆర్టిసి, అన్న క్యాంటీన్, పిజిఆర్సి, సిడిఎంఏ తదితర ఏడు శాఖకు సంబందించి 158 సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందని, మిగిలిన శాఖలకు సంబందించి మరో 500లకు పైగా సేవలను అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ప్రజల కోరికలు, డిమాండ్లు, అభిప్రాయాలను కూడా తెలుసుకునేందుకు కూడా ఈ వాట్సాప్ సేవలను భవిష్యత్తులో అన్ని శాఖలు వినియోగించాలని, ఈ యాప్ ద్వారా ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. వాయిస్-ఎనేబుల్డ్ సేవలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారని ఆయన తెలిపారు.