తిరుపతి, ఏప్రిల్17: శ్రీవారి భక్తులకు టిటిడి అందిస్తున్న సేవలపై ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సంతృప్తిని వ్యక్తం చేసింది. గతంలో భక్తులకు అందిస్తున్న సేవలకు, ప్రస్తుతం అందిస్తున్న సేవలలో చాలా మార్పు కనిపిస్తోందని ఏపీ శాసనసభ అంచనాల కమిటీ ఛైర్మెన్ శ్రీ వేగుల్ల జోగేశ్వర రావు వెల్లడించారు. శ్రీవారి భక్తుల సేవ నిరంతరం సేవ అని, శ్రీవారి భక్తులకు మరింత నాణ్యంగా అందిస్తూ శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని సూచించారు.
తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ అంచనాల కమిటీ ఛైర్మెన్ శ్రీ వేగుల్ల జోగేశ్వర రావు మాట్లాడుతూ, అంచనాల కమిటీ చేసిన పలు సూచనలను పరిగణలోకి తీసుకుని మరింత నాణ్యంగా సేవలు అందించాలని సూచించారు.
వైద్య సేవలపై అభినందనలు : ఇటీవల తాను శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని, అనుకోకుండా అనారోగ్యానికి గురై తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో చేరగా వైద్య సేవలు చాలా నాణ్యతగా, సేవాతత్వంతో అందించారని ఏపీ అంచనాల కమిటీ సభ్యులు శ్రీ పెన్మత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశ్విని ఆసుపత్రి సిబ్బందిని ఆయన అభినందించారు.
టిటిడిలో అమలవుతున్న సేవలపై సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా,
పరిశుభ్రత, పారిశుధ్యం - తిరుమలలో పరిశుభ్రత, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, భక్తులు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సేవలు అందుతున్నాయన్నారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని సభ్యులు సూచించారు.
నవతరానికి శ్రీవారి వైభవాన్ని తెలియజేసేలా డిజిటల్ మీడియాను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
శ్రీవారి సేవ - రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు శ్రీవారి సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని టిటిడి ఈవో వెల్లడించారు. వివిధ విభాగాలలో నైపుణ్యం, నిపుణుల సేవలను అన్ని విభాగాలలో అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఈవో తెలిపారు.
అదే విధంగా తిరుమలలో క్రమం తప్పకుండా టిటిడి సేవలపై ప్రకటనలు ఇవ్వాలని, టిటిడి వసతి గృహాలలో అన్ని చోట్ల శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీపద్మావతి అమ్మవారి చిత్ర పటాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వామివారి కీర్తనలు, గోవింద నామావళిని రాత్రి 10 గం.ల వరకు వినిపించేలా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరగా, టిటిడి ఈవో సమాధానం ఇస్తూ, ఇప్పటికే ప్రత్యేక చర్యలు చేపట్టామని, మరింత పటిష్టంగా అమలు చేస్తామని ఈవో చెప్పారు.
తిరుమలలో వసతి గదుల నిర్మాణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానం ఇస్తూ, కాలం చెల్లిన భవనాల స్థానంలో కొత్త భవనాలు, మరమ్మత్తులు మినహా హైకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టలేదని వివరించారు. వసతి గదుల నిర్వహణపై నిత్యం పర్యవేక్షణ చేస్తున్నామని ఈవో తెలిపారు. కాషన్ డిపాజిట్ ను భక్తులకు సకాలంలో చెల్లించేందుకు మరింత పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. ఒకరి పేరుతో వసతి గది తీసుకుని మరొకరు వచ్చి ఫేస్ రికగ్నిషన్ కోసం రావడం వల్ల చెల్లింపులో ఆలస్యం కావడం మినహా, కాషన్ డిపాజిట్ ను సంబంధిత వ్యక్తులకు సకాలంలో చెల్లింపు చేస్తున్నామన్నారు.
వైకుంఠం -1, 2 లలో భక్తులకు అందిస్తున్న అత్యవసర వైద్య సేవలపై సభ్యులు అడిగి తెలుసుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ పై సభ్యులు అడిగిన సమాచారాన్ని సభ్యులకు ఈవో తెలియజేశారు. టిటిడి ఆధ్వర్యంలో చేస్తున్న స్వామివారి, అమ్మవారి రాతి విగ్రహాల తయారీ, పంపిణీ వివరాలను సభ్యులు అడగగా, ఈవో మాట్లాడుతూ, హిందూ ఆలయాలకు 5 అడుగుల లోపు స్వామివారు, అమ్మవారి విగ్రహాలను ఉచితంగా అందిస్తామని, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల ప్రాంతాలలో ఉచితంగా సప్లయ్ చేస్తామని ఈవో చెప్పారు.
తిరుమలలో భక్తులకు అందిస్తున్న సేవలపై శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి ఏపీ అంచనాల కమిటీ సభ్యులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ అంచనాల కమిటీ సభ్యులు శ్రీమతి భూమా అఖిలప్రియ, శ్రీ నిమ్మక జయకృష్ణ, మద్దిపాటి వెంకటరాజు, డా. వాల్మీకి పార్థసారథి, శ్రీ పాశిం సునీల్ కుమార్, శ్రీ ఏలూరు సాంబశివరావు, శ్రీమతి వరుదు కళ్యాణి, శ్రీ పెన్మత్స వరాహా వెంకటసూర్య నారాయణ రాజు, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సీఈ శ్రీ సత్యనారాయణ తదితర అదికారులు పాల్గొన్నారు.