గన్నవరం :గ్రామాల్లో అద్వాన్నంగా మారిన అంతర్గత రహదారుల అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు గన్నవరం మండలం మాదలవారి గూడెంలో రూ.43 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ను ముస్తాబాద్ లో రూ.71 లక్షల నిర్మించిన రెండు సిసి రోడ్లను పురుషోత్తపట్నం గ్రామంలో రూ. 30 లక్షల ఖర్చుతో నూతనంగా నిర్మించిన ఒక సీసీ రోడ్డును గురువారం సాయంత్రం ఎమ్మెల్యే యార్లగడ్డ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఐదేళ్లపాటు రహదారుల అభివృద్ధిని పట్టించుకోకపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అద్వాన్న రహదారులను పునర్నించే కార్యక్రమం వేగవంతంగా సాగుతుందన్నారు. గన్నవరం నియోజకవర్గంలో ఇప్పటికే పలు గ్రామాలకు ప్రధాన రహదారులను అంతర్గత రహదారులను పునర్ నిర్మించినట్లు చెప్పారు.
ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు గ్రామాల్లోని అంతర్గత రహదారులన్నీ సిసి రోడ్లుగా మార్పు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఎక్కువ శాతం రోడ్లను సిసి రోడ్లుగా మార్పు చేసిన సంగతి ని ఈ సందర్భంగా యార్లగడ్డ గుర్తు చేశారు. గోతులమయంగా మారిన గన్నవరం నూజివీడు రోడ్డును ఇప్పటికే పునర్నిమించినట్లు ఆయన పేర్కొన్నారు.
నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు యార్లగడ్డ తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్న, నాయకులు పాలడుగు మల్లికార్జునరావు, మేడేపల్లి రమ, ఆయా గ్రామటిడిపి అధ్యక్షులు, టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.