Subscribe Us

header ads

టెన్త్ లోనూ ‘ఎంజేపీ’దే హవా


 

 95 శాతం ఉత్తీర్ణతతో టాప్ లేపిన బీసీ విద్యార్థులు

29 స్కూళ్లో 100 శాతం ఫలితాలు నమోదు

ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ఎంజేపీదే పైచేయి

 రాష్ట్ర స్థాయి పర్సంటేజీ కంటే అధికం

ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లోనూ ఇదే జోరు

బీసీ విద్యార్థుల రిజిల్ట్ పై మంత్రి సవిత హర్షం

 ఈ విజయం ముమ్మాటికీ సీఎం చంద్రబాబుదేనని వెల్లడి

అమరావతి : పదో తరగతి పరీక్షల్లోనూ మహాత్మా జ్యోతిరావు పూలే(ఎంజేపీ) బీసీ గురుకుల విద్యార్థులు టాప్ లేపారు. బుధవారం విడుదలైన టెన్త్ పరీక్షల్లో ఎంజేపీ బీసీ స్కూల్ విద్యార్థులు 95 శాతం మేర ఉత్తీర్ణతీ సాధించారు. ఇటీవల విడుదలైన ఇంటర్ పరీక్షల్లోనూ ఎంజేపీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించిన విషయం విధితమే. ఎంజేపీ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు.

 రాష్ట్రస్థాయి ఉత్తీర్ణత కంటే అధికంగా ఎంజేపీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం అధికంగా ఉండడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. రాష్ట్ర స్థాయి ఫలితాల్లో 81.14 శాతం మేర ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ ఫలితాల్లో బీసీ వెల్ఫేర్ కు చెందిన ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు 95 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 102 ఎంజేపీ స్కూళ్లకు చెందిన 5,788 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 95 శాతం మంది పాసయ్యారు. 

29 స్కూళ్లో వంద శాతం ఫలితాలు

ఈ ఏడాది మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కు చెందిన 11,819 పాఠశాలలకు చెందిన 6,14,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 102 ఎంజేపీ స్కూళ్లకు చెందిన 5,788 మంది విద్యార్థులకు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో 95 శాతం మంది పదో తరగతి పరీక్షల్లో పాసైయ్యారు. 29 ఎంజేపీ స్కూళ్లలో వంద శాతం మేర ఉత్తీర్ణత సాధించడం విశేషం. అదే సమయంలో ఎంజేపీ స్కూళ్లో జీరో ఉత్తీర్ణత శాతం నమోదుకాకపోవడం మరో విశేషం. 

రాష్ట్ర సగటు ఫలితాలు కంటే అధికం

ఇంటర్ ఫలితాలు మాదిరిగానే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేసిన టెన్త్ ఫలితాల్లో ఎంజేపీ స్కూళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. రాష్ట్ర స్థాయి సగటు ఫలితాలు పరిశీలిస్తే...81.14 శాతంగా నమోదైంది. ఎంజేపీ స్కూళ్ల విద్యార్థులు 95 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ఫలితాల్లోనూ ఎంజేపీ కళాశాలలు అత్యుత్తమ ఫలితాలు సాధించిన విషయం విధితమే. ఇంటర్ రాష్ట్ర స్థాయి సగటు ఫలితాలు పరిశీలిస్తే... ఫస్ట్ ఇంటర్ లో 70 శాతం ఫలితాలు రాగా, ఎంజేపీ కళాశాలు 92.40 శాతం మేర ఫలితాలు సాధించాయి. ఇంటర్ సెకండియర్ లో రాష్ట్ర వ్యాప్తంగా 83 శాతం మేర ఫలితాలు రాగా, ఎంజేపీ కళాశాల విద్యార్థులు 98 శాతం మేర ఉత్తీర్ణత సాధించడం విశేషం.

ఎంజేపీ బీసీ విద్యార్థులదే పైచేయి...

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు పరిశీలిస్తే... ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లతో సమానంగా ఎంజేపీ బీసీ స్కూళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించాయి. ఏపీ మోడల్ స్కూళ్లు 84 శాతం, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లు 89.5 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ 67.6 శాతం, కేజీబీవీ పాఠశాలలు 83 శాతం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు 71.9 శాతం, ఎయిడెడ్ స్కూళ్లు 73.3 శాతం, మున్సిపల్ పాఠశాలలు 69.3 శాతం, ప్రభుత్వ పాఠశాలలు 62.7 శాతం మాత్రమే ఫలితాలు సాధించాయి. ఏపీ రెసిడెన్షియల్ స్కూళ్లు 95 శాతం మేర ఫలితాలు సాధించాయి. వాటితో సమానంగా ఎంజేపీ స్కూళ్లు కూడా 95 శాతం మేర ఫలితాలు సాధించడం విశేషం.

ఈ విజయం సీఎం చంద్రబాబుదే... : మంత్రి సవిత

టెన్త్ ఫలితాల్లో ఎంజేపీ బీసీ స్కూళ్లు అత్యుత్తమ ఫలితాలు సాధించడంపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఎంజేపీ బీసీ స్కూళ్లు ఫలితాలు సాధించాయన్నారు. 29 స్కూళ్లో వంద శాతం పలితాలు రావడంపై ఆమె ఆనందం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల విద్యకు ఎంతో ప్రాధాన్యమిస్తోందని, సీఎం చంద్రబాబు ఆశయాలు నెరవేర్చేలా టెన్త్ లో ఫలితాలు రాబట్టినందుకు ఆమె విద్యార్థులను అభినందించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో విశేష కృషి చేసిన ఎంజేపీ బీసీ ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయేతర సిబ్బందికి కూడా మంత్రి సవిత అభినందనలు తెలిపారు. అధికారంలోకి రాగానే డైట్ బిల్లులు, కాస్మోటిక్ ఛార్జీల బకాయిల చెల్లించామన్నారు. హాస్టళ్ల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు నిధుల మంజూరు చేశామన్నారు. ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లతో పాటు విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. హాస్టళ్లకు నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా ఇన్వర్టర్లు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లోనూ పట్టు సాధించేలా ఉపాధ్యాయులతో నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించామన్నారు. ఈ విజయం ముమ్మాటికీ సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత స్పష్టంచేశారు.