14వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛమైన, ఆరోగ్యకర ఓటర్ల జాబితా రూపకల్పనలో, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాల్లో విశిష్ట సేవలందించిన ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసా పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లేందుకు ఎన్నికల ప్రక్రియ కీలకమని.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వామ్యం కావాల్సిన అవసరముందన్నారు.
ఆరోగ్యకర, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో బీఎల్‌వోలు, ఏఈఆర్‌వోలు, ఈఆర్‌వోలను సమన్వయం చేసుకుంటూ, నిరంతర మార్గనిర్దేశనంతో పారదర్శకమైన ఓటర్ల జాబితాకు రూపకల్పన చేయడంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు చూపిన చొరవ అభినందనీయమన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో కృతక్రుత్యులు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లా అధికారులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలకు అప్పగించిన బాధ్యతలను సమష్టి కృషితో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా పురస్కారం లభించిందన్నారు. పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ పురస్కారం లభించినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఓటు నమోదుపై ప్రజలను చైతన్యపరిచేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం, 18-19 ఏళ్ల యువత అత్యధికంగా ఓటర్లుగా నమోదు చేసుకునేలా కృషిచేయడం, ఫస్ట్ లెవెల్ ఈవీఎం చెకింగ్ ప్రక్రియను రాష్ట్రంలోనే మొదట పూర్తిచేయడం, ముసాయిదా ఓటర్ల జాబితాలో తప్పులను సకాలంలో సరిచేయడం, రికార్డులను హేతుబద్ధీకరించడం, జాబితాలో తుది చేర్పులు, ఆశించిన స్థాయిలో ఓటర్లను నమోదు చేయడంలో జిల్లాను ముందువరుసలో నిలపడం అభినందనీయమన్నారు. ఒకవైపు ఓటర్ల జాబితా రూపకల్పనను సమర్థవంతంగా నిర్వహిస్తూనే మరోవైపు నగరంలో ఏర్పాటు చేసిన భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) సమీక్షా సమావేశాల ఏర్పాట్లు, రాష్ట్రం నలుమూలల నుంచి సమావేశాలకు విచ్చేసే అధికారులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయడం అభినందనీయమన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలను జిల్లాలో పెద్దఎత్తున నిర్వహించడం జరిగిందని.. విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్లుకు కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. చేసిన కృషిని గుర్తించి జిల్లాకు అవార్డును అందించినందుకు గౌరవ గవర్నర్, ఈసీఐ, సీఈవోలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు.