అక్షయ డెవలపర్స్ అధినేత, జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మాదివాడ వెంకటకృష్ణ ( క్రిస్టియన్ ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది.
చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రం ఆవరణలో ఆదివారం వెంకటకృష్ణ ఆర్థిక సహకారంతో జనసేన పార్టీ నాయకుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని చల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి ప్రారంభించారు.
చల్లపల్లి మండలం నుంచే కాకుండా మోపిదేవి, ఘంటసాల, అవనిగడ్డ మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో మెడ్ స్టార్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ బి విజయ చైతన్య నేతృత్వంలోని నిపుణులైన వైద్యులు శిబిరానికి హాజరైన వారిని పరీక్షించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గుండె వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్ళు అందజేయడానికి సిద్ధం చేశారు. ఉచితంగా ఈసీజీ, 2డి ఎకో, కార్డియో గ్రాఫ్, గుండె స్కాన్, బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందించారు. యాంజియోగ్రామ్, స్టంట్ల అమరిక, బైపాస్ ఆపరేషన్లు చేయడానికి రిఫర్ చేశారు.
అవనిగడ్డ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి శిబిరానికి వచ్చిన వారితో వికాస కేంద్రం ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. వైద్య పరీక్షల నిమిత్తం వచ్చిన ప్రజలకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సహాయాన్ని అందించారు.
నిపుణులైన వైద్యులు డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నాగేశ్వరరావు, కొండయ్య, సింధు, ప్రశాంతి, రవి లు శిబిరానికి వచ్చిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
శిబిరానికి హాజరైన వారికి ఇబ్బందులు కలగకుండా మాదివాడ వెంకటకృష్ణ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు మజ్జిగను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, పార్టీ మండల అధ్యక్షులు చోడగం విమల కృష్ణ, కోన రాజశేఖర్, పూషడపు రత్న గోపాల్, గుడివాక శేషుబాబు, మర్రె గంగయ్య, ఉప సర్పంచ్ ముమ్మనేని రాజకుమార్ ( నాని ), తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, చల్లపల్లి టౌన్ పార్టీ అధ్యక్షులు బొందలపాటి వీరబాబు, తెలుగుదేశం పార్టీ మహిళా నేత దివి యుగందరి, బచ్చు వెంకట్ నాథ్, జనసేన పార్టీ మత్స్యకార వికాసం నేత లంకే యుగంధర్, బాదర్ల లోలాక్షుడు నాయుడు, కామిశెట్టి శ్రీనివాసరావు, పసుపులేటి రవికుమార్, కూరేటి రాఘవ, భూపతి నాగేశ్వరరావు లతో పాటు పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.