(మంజీరగళం)ప్రతినిధి.ఏలూరు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్ టిఆర్ భరోసా పెన్షన్లు సెప్టెంబరు నెల పెన్షన్ల చెల్లింపులను సెప్టెంబరు 1వ తేదీన ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగా అనగా ఆగస్టు 31వ తేదీనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు.
గురువారం సెప్టెంబరు నెల పెన్షన్ల పంపిణీపై సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహంచారు. ఈనెల 31వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసేందుకు సంబంధిత అధికారులు కృషిచేయాలన్నారు. శనివారం రోజున ఏదైనా కారణంతో పెన్షన్లు తీసుకోనివారికి సెప్టెంబరు 2వ తేదీన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఏలూరు జిల్లాలో సెప్టెంబరు నెలలో 2,65,992 మంది పెన్షన్ దారులకు రూ. 113.67 కోట్లు పంపిణీ చేయవల్సి వుండగా ఆగస్టు 31వ తేదీనే 100 శాతం పెన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు అందరూ పనిచేయాలన్నారు. జిల్లాలో సెప్టెంబరు నెల పెన్షన్లు ఆగస్టు 31వ తేదీన అందిస్తున్న విషయాన్ని ప్రతి పెన్షన్ దారునికి వ్యక్తిగతంగా తెలియజేయాలన్నారు. అలాగే పెన్షన్ల పంపిణీ సిబ్బంది తప్పనిసరిగా ఉదయం 6 గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఎక్కడైన ఏ ఒక్క పొరపాటు జరుగకుండా పెన్షన్ల పంపిణీ జరగాలని యంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లను కలెక్టర్ అదేశించారు. సమావేశంలో డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, ఎల్ డిఎం డి. నీలాధ్రి పాల్గొన్నారు.