(మంజీరగళం)ప్రతినిధి:ఏలూరు
ఏలూరుజిల్లా వచ్చే నవంబర్ నుండి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించి మెదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. 12,000 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మంజూరు చేస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలపటం పట్ల ఎంపీ హర్షం తెలిపారు. కాపర్ డామ్, డయాఫ్రమ్ వాల్ తో సహా పూర్తిస్థాయిలో గేట్ల నిర్మాణం పూర్తిచేస్తామన్నారు. పోలవరం నిధులు మంజూరు కావటంలో చంద్రబాబు నాయుడు కృషి చాలా ఉందన్నారు. ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి మంత్రులను పలుమార్లు కలిశారన్నారు. రాష్ట్రం బాగుపడాలన్నా, పోలవరం పూర్తికావాలన్నా, తెలుగు వారు తల ఎత్తుకు తిరగాలన్నా ఒక్క చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యమవుతుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతో ఉందని గుర్తు చేసారు. గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం 25 సంవత్సరాలు వెనుకబడిందన్నారు.12,127 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణం పూర్తి చేయటానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.
అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు కేటాయింపు, పామాయిల్ రైతుల ప్రయోజనాలు కాపాడటానికి దిగుమతి సుంకం వేయబోతున్నారని, ఎన్నికల్లో చెప్పిన ప్రతి పనీ చేస్తామన్నారు. స్వర్ణాంధ్ర రాధసారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలీపారు.