(మంజీరగళం)ప్రతినిధి.బుట్టాయిగూడెం
ఏలూరుజిల్లా బుట్టాయిగూడెం మండలం గిరిజనుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ ను కోటరామచంద్రాపురం ఐటిడిఎ కార్యాలయంలో గురువారం నిర్వహించగా గిరిజన ప్రాంతాల నుండి 285 అర్జీలు అందాయి. వీటిని సత్వరమే విచారణ చేపట్టి పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్,ఐటిడిఎ ఇన్ చార్జి పివో పి. ధాత్రిరెడ్డి ఆదేశించారు. ప్రతి నెల 4వ గురువారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని గిరిజనులు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. గిరిజన గ్రీవెన్స్ లో పోలవరం శాసన సభ్యులు చిర్రి బాలరాజు, జంగారెడ్డిగూడెం ఆర్డివో కె. అద్దయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అందిన అర్జీల్లో కొన్ని.జీలుగుమిల్లి మండలం వంకరవారిగూడెం పంచాయితీ కి చెందిన పూనెం వెంకటేశ్వరరావు ఎటువంటి విచారణ చేయకుండా మూసివేసిన తమ భూమి బదలాయింపు కేసును ఓపెన్ చేసి గ్రామ సభ నిర్వహించి హక్కులు నిర్ధారణ ద్వారా తమ భూమిని అప్పగించమని కోరుతూ అర్జీ అందజేశారు. ధర్మగూడెం గ్రామ పంచాయితీ శివారు గ్రామమైన పాతపండువారిగూడెం గ్రామ కాపస్తులు ఊరిమధ్యలో త్రీఫేస్ కరెంట్ లైను తమ ఇండ్లపై నుండి పోవుచున్నది. కాబట్టి ఎటువంటి ప్రాణ, ఆస్దినష్టం జరుగకుండా త్రీఫేస్ లైనును ఇండ్ల పై నుంచి తొలగించడానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్ధులు అర్జీ అందజేశారు. పోలవరం మండలం కారుటూరు గ్రామ పంచాయితీకి చెందిన పార్వతి కొండపొడు భూములకు పట్టాలిచ్చి నష్టపరిహారం ఇప్పించమని కోరుతూ అర్జీ అందజేశారు. పోలవరం మండలం చీడూరు గ్రామ కాపురస్ధులకు పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇంతవరకు రాలేదని దానిని ఇప్పించాలని అర్జీ అందజేశారు. టేకూరు గ్రామానికి చెందిన గళ్లపల్లి త్రిపురసుందరి ఇంటిస్ధలం కోసం పట్టాలిచ్చారుకానీ ఇంతవరకు కొలిచి ఇది మీస్ధలం అని ఇవ్వలేదని, ఇంటికి శాంక్షన్ అయిన డబ్బులు ఇప్పించవలసిందిగా అలాగే తమ ఇంటిస్ధలం చూపించి ఇంటి నిర్మాణానికి డబ్బులు మంజూరు చేయవల్సిందిగా కోరుతూ అర్జీ అందించారు.