మంజీర గళం ప్రతినిధీ :గన్నవరం
దేశంలో పసికందునుండి వృద్ధ మహిళల వరకు రక్షణ లేకుండా సమాజం ఎటు పోతుందని అన్ని రాజకీయ పార్టీలు ఆలోసించమని విజ్ఞప్తి చేసిన గన్నవరం జడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజ బెత్ రాణి ఒక పత్రిక ప్రకటనలో కోరారు.కోల్‌కతాలో యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య యావద్దేశాన్ని దిగ్భ్రాంతపరిచాయి. తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలాంటి ఘటనలపై వేగంగా విచారణ చేపట్టి, దోషులకు కఠిన శిక్షలు విధించడం అత్యవసరం. సత్వర చర్యలు తీసుకుంటేనే బాధితులకు సరైన న్యాయం జరుగుతుంది. పిల్లలపై అకృత్యాలు బాలలు చేసే నేరాలకు పెరిగిపోవడం చూస్తుంటే మన సమాజం ఎటు పోతుందని అనుమానం కలుగుతుంది.
పరిష్కార మార్గాలిలా...
పిల్లలపై లైంగిక అత్యాచారాలు మినహా ఇతర రకాల నేరాలను తీవ్రమైనవిగా చాలామంది పరిగణించడం లేదు. చిన్నారులనుఅపహరించుకుపోయి వారిని విడుదల చేయడానికి డబ్బులు డిమాండ్ చేయడం, హింసించడం, హతమార్చడం కూడా హేయమైన నేరాలే. ఆడ శిశువులను గర్భంలోనే అంతమొందించడం ఇంకా క్రూరమైన నేరం. ఇలాంటి వాటికి శిక్షలు పడేలా జాగ్రత్త తీసుకోవాలి. శుష్క ప్రసంగాలు, పథకాలతో పనికాదని గ్రహించాలి. పిల్లలు, మహిళలపై నేరాలకు వెంటనే శిక్షలు పడటం లేదు. ప్రత్యేక కోర్టులు కూడా ఈ విషయంలో విఫలమయ్యాయి. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల సంగతీ అంతే! బాలలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు వంటి కేసులను నిర్ణీత కాలంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. స్త్రీని తల్లిగా, చెల్లిగా, కూతురిగా కీర్తించడంతో సరిపెట్టకుండా బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చూడాలి. నేటి బాలలే రేపటి ఆశాజ్యోతులంటూ ఊదరగొట్టడం కన్నా వారి భద్రతకు సకల జాగ్రత్తలూ తీసుకోవడం చాలా ముఖ్యం.
భయాందోళనలు లేని వాతావరణంలో వారు పెరిగేలా చూడటం జాతి బాధ్యతే. అన్నింటినీ మించి స్త్రీలు, పిల్లలపై జరిగే నేరాల గురించిన చర్చల్లో రాజకీయాలు చొరబడకుండా చూడాలి. హేయమైన నేరం హేయమైనదే అవుతుంది తప్ప రాజకీయ జోక్యంతో దాని తీవ్రత తగ్గిపోదు. చిన్న పిల్లలపై నేరం జరిగితే వెంటనే శిక్షించాల్సింది పోయి ఆ ఉదంతాన్ని రాజకీయం చేయడమెందుకు? రాజకీయ పార్టీలు ఇలాంటి నేరాలను నివారించడంపై దృష్టి పెట్టాల్సింది పోయి, ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకోవడం క్షంతవ్యం కాదు. బాలలు, స్త్రీలపై నేరాలు జరిగినప్పుడు సమర్థంగా దర్యాప్తు జరిపి నేరస్థులను శిక్షించడానికి తగిన యంత్రాంగాలను సిద్ధం చేసుకోవడం సమాజం మీదున్న బాధ్యత!అందుకు అన్ని రాజకీయ పార్టీలు ఒకే నిర్ణయానికి వచ్చేవిధంగా ఆలోసించాలని ఆమే విజ్ఞప్తి చేస్తున్నాని అన్నారు.