(మంజీరగళం ప్రతినిధి ): పాతపట్నం, శ్రీకాకుళం
కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ఒకేరోజు అన్ని గ్రామపంచాయతీలలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించినప్పటికీ ప్రజలకు ఇవి ఉపయోగకరం కాదని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు.
గతంలో ఎన్నడూ నిర్వహించని విధంగా గ్రామ సభలు నిర్వహించామని కూటమి ప్రభుత్వ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలకాలని భావిస్తున్నప్పటికీ.. ఒకే రోజు గ్రామ సభను నిర్వహించడం ద్వారా ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు అందరూ ప్రతి గ్రామ సభకు హాజరు కావడానికి వీలు కాకపోవడం వలన ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం, ప్రజల నుండి ఆయా గ్రామాల సమస్యలు తీసుకునే దిశగా ముందడుగు వేయడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు. గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో పనులు చేయాలనే ఆలోచన బాగున్నప్పటికీ.. ఒకే రోజు గ్రామంలో ఉన్న ప్రతి సమస్య చర్చించడానికి సమయం కూడా లేకుండా గందరగోళంగా గ్రామ సభల నిర్వహణపై ఆమె ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నించారు. ఒక షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలునిర్వహించినట్లయితే ఉపాధి హామీ పథకంలో చేయాల్సిన పనులకు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి సంబంధిత శాఖ అధికారులు హాజరవడానికి అవకాశం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అభిప్రాయపడ్డారు. హడావుడిగా గ్రామసభలు నిర్వహించి మమ అనిపించడం కాకుండా..ప్రజలకు ఉపయోగపడిన కార్యక్రమాలు చేయాలని ఆమె పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మభ్య పెట్టారు గాని వాటిని గాలికి వదిలేశారని అన్నారు.