ఏలూరు :
టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశ నిర్దేశం చేసిన కలెక్ట ర్జల్లా,డివిజన్,మండల స్థాయిలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు. ఏలూరుజిల్లా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలనూ తీసుకోవాలని కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్‌డిఓలు, తాహశిల్దార్లతో తన ఛాంబర్ నుంచి శనివారం ఉదయం కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఆయా శాఖలు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ వర్షాల కారణంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సంబoధిత అధికారులు మండలాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.
జిల్లా స్థాయితోపాటు, డివిజన్, మండల స్థాయిలో కూడా కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, పంచాయితీరాజ్, నీటి పారుదల, వైద్యారోగ్యశాఖ, విద్యుత్, వ్యవసాయ, పశు సంవర్థక, మత్స్య, ఉద్యాన, గృహనిర్మాణ శాఖలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాజ్‌వేలు, కల్వర్టులవద్ద కాపలా ఉంచాలని, నీరు పారే సమయంలో వాటిపై నుంచి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. రిజర్వాయర్ల నుంచి నీరు విడుదల చేసేముందు రెవెన్యూ అధికారులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని డిపిఓకు సూచించారు. ఆసుపత్రుల్లో మందులు, అవసరమైన సామగ్రి సిద్దంగా ఉంచాలని, క్షేత్రస్థాయి సిబ్బంది ఈ మూడు రోజులూ గ్రామాల్లోనే ఉండాలని వైద్యారోగ్యశాఖను ఆదేశించారు. విద్యుత్ స్తంబాలు నేలకూలడం, వైర్లు తెగిపడటం కారణంగా ఎక్కడా ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎపిఈపిడిసిఎల్ అధికారులకు సూచించారు. పంట పొలాల్లో నీరు నిలిచి ఉండకుండా చూడాలన్నారు. మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్డిఓలకు మరిన్ని సూచనలు చేశారు.
జిల్లాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనితోపాటు వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని దీనిని దృష్టిలో ఉంచుకుని, క్షేత్రస్థాయి సిబ్బంది ముఖ్యంగా కుకునూరు, వేలేరుపాడు తహశీల్దార్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు చెట్లు,టవర్స్,పోల్స్, పొలాలు,బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఉండలేకుండా అవగాహన కలిగించాలన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందేలా చూడాలన్నారు. గిరిజన ప్రాంతాలలోని కొండ వాగులు ఉధృతంగా ప్రవహించే అవకాశం ఉన్నందున, కాజ్ వే లపై ప్రజలు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భారీ వర్షాల కారణంగా వృక్షాలు కూలిపోతే, వెంటనే తొలగించేందుకు రహదారులు, భవనాల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు
కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 1800 233 1077,,మరియు 94910 41188
ఐటిడిఏ కోటరామచంద్రాపురం 08821-232221
ఆర్డీఓ ఆఫీస్,ఏలూరు - 08812-232044 - 9491041424
ఆర్డీఓ ఆఫీస్, జంగారెడ్డిగూడెం - 8309705048
ఆర్డీఓ ఆఫీస్, నూజివీడు - 08656-232717
విద్యుత్ శాఖ - 9440902926
ఏలూరు నగరపాలక సంస్థ - 08812-222200, 232101