(మంజీరాగళం ప్రతినిధి ):ఆనందపురం
ఆనందపురం మండలం భీమిలి నియోజకవర్గంలో గల వెల్లంకి గ్రామపంచాయతీ లో ఉన్న రవీంద్రభారతి పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి.హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏడాది శ్రావణ మాసంలో క్రిష్ణ పక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారని,ఈ పవిత్రమైన రోజున ప్రపంచ వ్యాప్తంగా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని,భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ... అన్న గీతోపదేశంతో మానవాళికి దిశనిర్దేశం చేశారు కృష్ణభగవానుడు. మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహా భాగవతం కథలను విన్నా... దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి. ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉండటం కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి, ఆయన లీలలకు అద్దం పడుతోందని,ద్వాపరయుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారని,అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్టదైవంగా కొలుస్తున్నారని,వివిధ రూపాల్లో, సంప్రదాయాలతో భక్తిప్రపత్తులతో కృష్ణుడిని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్.ఉమామహేష్ అన్నారు.చిన్నారులు ధరించిన రాధాకృష్ణులు,గోపికల వేషధారణలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.కార్యక్రమములోనార్త్ ఆంధ్ర జోనల్ ఇన్చార్జ్ ఎన్ .వెంకటేష్ ,సిజిఎం .జి .ఆర్ .వసంత, తల్లిదండ్రులు ,చిన్నారులు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.