ఏలూరు జిల్లా - బుట్టాయిగూడెం:
ప్రభుత్వ నిధులతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఏ ఫ్రాన్సిస్ అన్నారు. మండల కేంద్రంలో ఉన్న రాజీవ్ నగర్ కాలనీలోని దళితులు ఆదివారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ మాట్లాడుతూ బుట్టాయిగూడెంలో ఎస్సీ కాలనీ ఏర్పడి 40 సంవత్సరాలు అయిందని, ఇప్పటివరకు కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ఓట్ల అభ్యర్థన కొరకు వివిధ రకాల పార్టీ నాయకులు వచ్చి కల్లబొల్లి హామీలు ఇచ్చి, గెలిచిన తర్వాత మొహం చాటేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ నడి మధ్యలో 12 సెంట్లు స్థలం ఉందని ఆ స్థలంలో ఆ కాలనీ దళితులకు ఉపయోగపడే విధముగా కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వేడుకున్న ఫలితం లేదన్నారు. ఆ కాలనీలో నివసిస్తున్న పేదల గృహాల వద్ద ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే సరిపడా స్థలము లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. ప్రజా ఓట్లతో అధికారం దక్కించుకున్న కూటమి ప్రభుత్వ నాయకులు స్పందించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేసి పేదల అవసరాలు తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం గంజి రాజేష్, గుల్ల సురేష్, బంటుమిల్లి మంగా, మంగమూరి బేబీ, ఎం వెంకటేశ్వరావు, పి సూరయ్య, జి సునీత, టీ ఇందిరా, పి మందాకిని, బి బాలు తదితర కమిటీ పెద్దలుతో కూడిన గ్రామ అభివృద్ధి కమిటీను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ ఏలూరు జిల్లా కమిటీ సభ్యులు వై రాజు పాల్గొన్నారు.