Subscribe Us

header ads

గ్రామాల అభివృద్ధి పనులకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ముందస్తు ప్రణాళిక …

గ్రామాల్లోని ప్రజల అవసరాల మేరకు పనులు గుర్తింపుకు గ్రామ సభ.

జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.

మంజీర గళం ప్రతినిధి: చింతలపూడి.

చింతలపూడి/ఏలూరు ఆగస్టు 23... గ్రామాల అభివృద్దిలో పయనించాలంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా పనులను చేపట్టడానికి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామ సచివాలయం వద్ద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ఆంధ్రప్రదేశ్ 2024-25 ఆర్ధిక సంవత్సర పనులు గుర్తింపుకు ప్రణాళిక ప్రక్రియమీద గ్రామ సభ జిల్లా నీటియాజమాన్య సంస్ధ ఏలూరు వారి ఆధ్వర్యంలో గ్రామ సర్పంచి తొమ్మండ్రు భూపతిరావు అద్యక్షతన జరిగింది. ఈ గ్రామ సభకు ముఖ్యఅతిధులుగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, చింతలపూడి నియోజకవర్గ శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ హాజరయ్యారు. ఈ గ్రామ సభను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకానికి సంబంధించి జిల్లాలో 547 గ్రామ పంచాయితీలలో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజాస్వామ్య పద్దతిలో గ్రామ సభలు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ప్రణాళికను రూపొందించడం జరుగుతుందని చెప్పారు. గ్రామ ప్రజలకు సుపరిపాలన అంధించడంలో అభివృద్ధి, సంక్షేమ అమల్లో నిర్మాణాత్మకమైన పాత్రను పోషించే విధంగా గ్రామ ప్రజలు పరిపాలనా విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. జిల్లాలో ప్రగడవరం గ్రామాన్ని మోడల్ పంచాయితీగా తీర్చిదిద్దడానికి గ్రామ ప్రజాప్రతినిధులు, ప్రజలందరూ కృషిచేయాలన్నారు. డెంగ్యూ కు సంబంధించిన కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా గ్రామస్ధులందరూ అప్రమత్తమై వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎఎన్ఎంలు, ప్రతిఇంటికి వెళ్లి సర్వేచేపట్టి డెంగ్యూకు సంబంధించిన అలాగే వైరల్ జ్వరాలను గుర్తించి తక్షణమే వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.  

 కార్యక్రమంలో చింతలపూడి శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రగడవరం గ్రామ పంచాయితీల్లో గ్రామ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పధంలో నడిపించడానికి గ్రామ పంచాయితీలు కృషి చేయాలన్నారు. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని చెప్పిన మహాత్ముని మాట్లను స్పూర్తిగా తీసుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయితీ వ్యవస్ధను పారదర్శకతతో నిర్వహించడానికి చర్యలు చేపట్టారని ఇందులో భాగంగానే ఒక్క రోజులోనే రాష్ట్రంలో అన్ని పంచాయితీల్లో గ్రామాల్లో అభివృద్ధి పనులు గుర్తించడానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామ సభల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా అభివృద్ధి పనులను సభాముఖంగా తెలియజేసిన వాటిని గుర్తించి వాటి అమలుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  

 సమావేశంలో ఏలూరు నీటియాజమాన్య సంస్ధ పిడి రాము మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం చట్టం చేయబడిందని దీనిద్వారా వేతనదారులకు నూరు రోజులు పనికల్పించడం జరుగుతుందని కుటుంబానికి ఒకరికి మాత్రమే జాబ్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో డ్రైనేజీలు, సిసి రోడ్లు, చెక్ డ్యాంలు, చెరువులు, అంతర్గతరోడ్లు, తదితర 87 రకాల పనులను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పధకం ద్వారా చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ గ్రామ సభలో ఇంటర్నల్ మెటీరియల్ వర్క్స్ కింద 8 సిసి రోడ్లు, పంటకాలువ కింద 13, అలాగే పండ్ల తోట్లకు సహకారం గురించి ఈ సభలో చర్చించడం జరిగిందని తెలిపారు. ఇంకా ఏమైనా పనులు కావాలంటే గ్రామ సభలో ప్రత్యేక కౌంటరును ఏర్పాటు చేశామని పనికి సంబంధించిన ధరఖాస్తును కౌంటర్ లో అందజేయవచ్చని తెలిపారు. ఈ సభలో రైతులకు సంబంధించి గోకులాలు, షెడ్లు, పశుగ్రాసం, తదితర అంశాలపై చర్చించడం జరిగింది. అనంతరం సచివాలయ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, స్ధానిక శాసన సభ్యులు సొంగా రోషన్ కుమార్ మొక్కలను నాటారు.  

 కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ బి. మోహన్ మురళీధర్, జెడ్పిటిసి, యంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.