నాగాయలంక
జిల్లా కలెక్టర్ డి కే బాలాజీ అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధ ప్రసాద్ తో కలిసి సోమవారం నాగాయలంక మండలం ఏటిమొగ ఎంపీపి స్కూల్లో వరద బాధితులకు బియ్యం, నిత్యవసర సరుకు పంపిణీ చేశారు. ఏటిమొగ గ్రామ పరిధిలో 630 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఒక కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంప, ఉల్లిపాయ, పంచదార, లీటరు పామాయిల్ వరద బాధితులకు అందించారు. ఇదే పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు కలెక్టర్ పరిశీలించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు
మెనూ ప్రకారంగా భోజనం అందిస్తున్నది లేనిది ఆరా తీశారు. పాఠశాల ఆవరణలో విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ ఉందని, దీని వల్ల పిల్లలకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడాలని ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ ను కోరగా, ట్రాన్స్ఫార్మర్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి లేదా రీప్లేస్ చేయడానికి చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎదురు మొండి దీవుల్లో కృష్ణ వరద ఉధృతికి కోతకు గురైన గొల్లమంద- జింకపాలెం గ్రామాల కరకట్ట రహదారి నదిలో పంటు మీద ప్రయాణించి పరిశీలించారు. అనంతరం గ్రామస్తులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
వరద ఉధృతికి కరకట్ట కోసుకుపోకుండా పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అందుకోసం అంచనాలు రూపొందించాలని ఇరిగేషన్ రివర్ కన్జర్వేటివ్ విభాగ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కరకట్ట కోసుకుపోవడంతో దెబ్బతిన్న రహదారి నిర్మాణానికి, దాని ప్రక్కన కాలువ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ అంచనాలు సిద్ధం చేయాలని ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులకు కలెక్టర్ సూచించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాo కలెక్టర్ తో ఉన్నారు. బందరు ఆర్డిఓ ఎం వాణి, తాసిల్దారు హరనాథ్, ఇరిగేషన్ డిఈ భాను కిరణ్, మండల ప్రత్యేక అధికారి /ఏడి మార్కెటింగ్ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.