Subscribe Us

header ads

ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షణ కోసం పోరాడాలి


జీలుగుమిల్లి:-

ఏలూరుజిల్లా జీలుగుమిల్లి కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మంగళవారం నాడు జీలుగుమిల్లి మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య కార్యకర్తలకు, నాయకులకు "ఉపాధ హామీ ఆవశ్యకత - భూమి వ్యవసాయ కార్మికుల స్థితిగతులపై" క్లాస్ నిర్వహించడం జరిగింది. ఈ క్లాసులకు ముఖ్యఅతిథిగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు హాజరైనారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమిలో భాగంగా పేదలు, వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనుల పైన దాడి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానంగా ఈ వర్గానికి చెందిన కోట్లాదిమంది పేదలకు బువ్వ పెడుతున్న చట్టం మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టమని దీని నీరు గార్చేవిధంగా కేంద్ర బిజెపి ఎన్డీఏ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. ఈ చట్టానికి నిధులు తగ్గించే, పనులు తగ్గించే కూలీలను, పేదలను, వ్యవసాయ కార్మికులను రోడ్డున పడేసే విధంగా చర్యలు చేపట్టిందని తెలిపారు. కోట్లాదిమంది పేదల జీవితాలను బుగ్గిపాలు చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. 

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాలను వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఉపాది హామీ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని గత నెలలో నిర్వహించిన గ్రామసభల్లో ఉపాధి హామీ కూలీలకి పనులు లేకుండా హార్టికల్చర్, అగ్రికల్చర్ అనే పేరుతో ఉపాది హామీ చట్టాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని విమర్శించారు. ఇది సరైన పద్ధతి కాదని దీనివలన కోట్లాదిమంది గ్రామీణ పేదలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ గ్రామసభలు నిర్వహించాలని ఆ గ్రామసభల్లో అసలైన భూమివారసులను గుర్తించాలని కోరారు. రెవెన్యూ భూ సదస్సులో వచ్చిన సమస్యలను అధికారులు త్వరితిగతిన పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ గ్రామ సభల ద్వారా గ్రామాల్లో ఏళ్ల తరబడి అన్యాక్రాంతమైన భూములకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. భూమిలేని నిరుపేదలకు, దళిత, గిరిజనులకు ఈ భూములు పంచాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఏళ్ల తరబడి గిరిజనులు ఎల్ టి ఆర్, పోడు భూముల సమస్యలపై పోరాడుతున్నారని తెలిపారు. ఆ భూముల సమస్యలను నూతన ప్రభుత్వం పరిష్కారం చేయాలని గిరిజనులకు సాగు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 చింతలపూడి, దెందులూరు, నూజివీడు నియోజకవర్గలాల్లో అన్యాక్రాంతమైన అసైన్డ్, సీలింగ్, మరియు దయ్యాళ్ల భూములను సర్వే చేసి అసలైన హక్కుదారులకు ఈ భూములను పంచాలని డిమాండ్ చేశారు. భూమి అందరికీ దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేదలకు ఆసరాగా నిలవాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు ప్రత్యేక సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాబోయే కాలంలో పేదల పక్షాన ఐక్య ఉద్యమాల చేయడానికి ఈ రాజకీయ తరగతులు ఉపయోగపడతాయని తెలిపారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ రానున్న కాలంలో అటవీ, అసైన్డ్,సీలింగ్ భూ సమస్యల పైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు ఈ రాజకీయ తరగతులు ఉత్తేజాన్నిచ్చాయని తెలిపారు. రానున్న కాలంలో భూ పోరాటాలు, ఇళ్లస్థలాల సమస్యలు గ్రామీణ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘం పోరాడుతుందన్నారు. ఆ పోరాటంలో పేదలందరూ కలిసి రావాలని కోరారు. ఈ తరగతులకు జిల్లా వ్యాప్తంగా 200 మంది ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు.ఈ తరగతులలో జిల్లా అధ్యక్షులు జీవరత్నం అధ్యక్షత వహించగా తామా ముత్యాలమ్మ, రాజమండ్రి డానియల్, ఉడత వెంకటేష్, కారం దుర్గ, అందుగుల ప్రభాకర్ నాయకత్వం వహించారని తెలిపారు.