ఏలూరు:
ఏలూరుజిల్లా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఏలూరు జిల్లా రైస్ మిల్లర్స్ అసోషియేషన్ ను జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి అభినందించారు. స్ధానిక రైస్ మిల్లర్స్ అసోషియేషన్ భవనం నుంచి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు తరలిస్తున్న ఆహార పొట్లాలు,వాటర్ ప్యాకెట్లు వాహనాన్ని జెసి పి. ధాత్రిరెడ్డి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా జెసి మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో కలిగిన తుఫాను విపత్కర పరిస్థితుల వల్ల బాధితులకు ఏలూరు నుంచి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున ఆహార, పానియాలు తదితర వస్తువులను అందించడం స్పూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సెక్రటరీ పైడిపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునే నిమిత్తం అసోసియేషన్ నుంచి మూడు లారీలను 20 వేల ఆహారపు పొట్లాలను, 10,000 వాటర్ ప్యాకెట్లు విజయవాడకు పంపిస్తున్నామన్నారు.
ప్రకృతి బీభత్సానికి గురైన ప్రజలను ఆదుకునేందుకు అసోసియేషన్ తరపున ముందుంటామన్నారు. కార్యక్రమంలో ఏలూరు ఆర్డిఓ ఎన్ఎస్ కె ఖాజావలి, డిఎస్ఓ సత్యనారాయణరాజు, పౌర సరఫరాల సంస్ధ జిల్లా మేనేజరు మంజూ భార్గవి, రైస్ మిల్లర్స్ అసోషియేషన్ గౌ. అధ్యక్షులు జయబాబు, జిల్లా కోశాధికారి వందనపు సత్యనారాయణ , చెక్క సత్యనారాయణ పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.