గన్నవరం,
రంగన్నగూడెంలో ఘనంగా భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ 163వ జయంతి వేడుకలు సృజనాత్మకమైన వృత్తి నైపుణ్యాలతో పరిమితమైన వనరుతో నాణ్యమైన పనులు నిర్వహించి తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి దేశం గర్వించదగ్గ విధంగా ఎన్నో ఇంజనీరింగ్ సాంకేతిక కట్టడాలు అందించిన గొప్ప వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరాయ అని జలవనరుల శాఖ రాష్ట్ర ఎపెక్స్ కమిటీ మాజీ సభ్యులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అన్నారు. ఈరోజు ఉదయం కృష్ణాజిల్లా, బాపులపాడు మండలం, రంగన్నగూడెం గ్రామంలోని సామాజిక భవనంలో గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరాయ 163వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, గ్రామ సర్పంచ్ కసుకుర్తి రంగామణి, ఎం.పి.టి.సి. సభ్యులు పుసులూరు లక్ష్మీనారాయణ, ఎం.పి.సి. ఎస్., అధ్యక్షులు మొవ్వా శ్రీనివాసరావు, పి.ఎ.సి.ఎస్., మాజీ అధ్యక్షులు తుమ్మల దశరథరామయ్య తదితరులు విశ్వేశ్వరాయ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఇదే విషయమై ఈరోజు సాయంత్రం రంగన్నగూడెం నుండి ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరాయ సివిల్ ఇంజనీరుగా, ఆర్థికవేత్తగా, నీటి యాజమాన్య నిపుణుడిగా, డ్యామ్ల నిర్మాతగా, స్టేట్స్ మేన్గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి దేశాభివృద్ధికి బీజాలు వేశారని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుపతినుంచి తిరుమలకు మొదటి ఘాట్ రోడ్డు నిర్మాణానికి అంకురార్పణ చేసి, విశాఖపట్నంలో సముద్రం కోతకు గురికాకుండా చర్యలు తీసుకుని విశాఖపట్నం పోర్టు నిర్మాణం త్వరగా పూర్తికావటానికి సహకారం అందించారని తెలిపారు.
ఆయన ఇచ్చిన స్ఫూర్తితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు దశ-దిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ను కరువురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర జలవిధానాన్ని రూపొందించటం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని యువ ఇంజనీర్లందరూ మోక్షగుండంను స్ఫూర్తిగా తీసుకుని నీతి, నిజాయితీతో పనిచేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుతోపాటు నిర్మాణంలో వున్న జలవనరుల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రముఖులు నెరుసు వెంకటేశ్వరరావు, కసుకుర్తి వెంకటనరసింహారావు, మొవ్వా వెంకటేశ్వర చౌదరి, ఆళ్ళ శ్రీనివాసరావు, కనకవల్లి శేషగిరిరావు, కసుకుర్తి అర్జునరావు, పుసులూరు స్వామి, ఆలపాటి రవికిషోర్, జాలిపర్తి సీతారామయ్య, కనగాల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు