ఏలూరు:
ఏలూరుజిల్లా గోదావరి వరద ఉధృతి మరలా పెరుగుతున్న దృష్ట్యా గోదావరి నదీతీర ప్రాంతంలోవున్న కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సాయంత్రం 5.00 గంటలకు భధ్రాచలం వద్ద 38.50 అడుగులకు గోదావరి నీటిమట్టం నమోదైయిందని ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ముంపుకు గురయ్యే ప్రాంతాల ప్రజలను తరలించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న గోదావరి వరద నేపద్యంలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద పరిస్ధితులను ఎదుర్కొనేందుకు నిర్ధేశించిన మార్గదర్శకాలను పాటించి అందుకు తగిన విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. మొదటి ప్రమాధ హెచ్చరిక జారీ చేయకముందే ముంపుప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యంగా ఆయా గ్రామాల్లోని గర్భిణులు, అనారోగ్యంగా ఉన్నవారిని, వృద్ధులను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల వద్ద అవసరమైన నిత్యావసర వస్తువులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
ఈవిషయంపై పౌర సరఫరాల డిఎం, డిఎస్ఓ, మార్కెటింగ్ ఎడిలు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన మేర కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, మస్కిటోకాయిల్స్, విద్యుత్ సౌకర్యంకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. గోదావరి ఉధృతి దుష్ట్యా ఆయా మండలాల ప్రజలు గోదావరినది పరివాహక ప్రాంతాల్లోకి వెళ్లవద్దన్నారు. త్రాగునీటికి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని పునరావాస కేంద్రం వద్దకూడా అవసరమైన త్రాగునీటి వసతి, టాయిలెట్లను సిద్దం చేయాలన్నారు. పారిశుధ్య పరిస్ధితులను మెరుగుపరచడంతోపాటు వైద్య శిబిరాలను ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలన్నారు. వరద పరిస్థితిపై కలెక్టర్ వెట్రిసెల్వి ఎప్పటికప్పుడు అధికారులతో టెలిఫోన్ ద్వారా సమీక్షించి అవసరమైన సూచనలను అందజేస్తున్నారు.