అమరావతి:
ప్రజలకు నిత్యావసరాలు, ఆహారం, తాగు నీరు, ఔషధాలు అందుబాటులో ఉంచాలి ఏలేరుకు వరదపై జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేసిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న జల ప్రవాహంతో ఏలేరు జలాశయానికి వరద ముప్పు పొంచి ఉన్నందున ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఏలేరు రిజర్వాయర్ పరిస్థితిపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడారు. ఏలేరుకి వచ్చిన వరద నీరు, ఈ రోజు సాయంత్రం నుంచి విడుదల చేయాల్సిన పరిస్థితిని కలెక్టర్ వివరించారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఏలేరు రిజర్వాయర్ కి 20.2 టీఎంసీల నీరు చేరుకుందనీ, క్రమంగా నీరు వదలాల్సి ఉంటుందని తెలిపారు. ఈ రోజు సాయంత్రం 500 క్యూసెక్కుల నీరు విడిచిపెడతామని చెప్పారు. పిఠాపురం, పెద్దాపురం నియోజక వర్గాల వైపు నీరు మళ్ళుతుందన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకి దిశానిర్దేశం చేశారు. "పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలి. జగనన్న కాలనీ ఇప్పటికే మంపులో ఉన్నందున అక్కడివారికి నిత్యావసరాలు అందించాలి.
ఈబీసీ కాలనీ, సూరంపేట రైల్వే స్టేషన్ ఏరియా, సీతానగరం, లక్ష్మణపురం, మల్లవరం, ఎ.విజయనగరం, ఏకే మల్లవరం గ్రామాలవారిని అప్రమత్తం చేయండి. ముంపు గ్రామాల ప్రజలకు అవసరమైన ఆహారం, తాగు నీరు, ఔషధాలు పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలి. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకొని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాలి " అన్నారు.