Subscribe Us

header ads

క్యాన్సర్ ర్యాలీ ని ప్రారంభించిన పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు


 గోకవరం :

కమ్యూనిటీ పారామెడిక్స్& ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్(పియంపి అసోసియేషన్) తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ఎమ్ నాగేశ్వరరావు అధ్యక్షతన మంగళవారం స్ధానిక ప్రెస్ క్లబ్ నందు క్యాన్సర్ పై అవగాహన సదస్సు, ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక కెవిఎస్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడుతూ క్యాన్సర్ పై ప్రజలకు అవగాహన కల్పించుటకు రాష్ట్ర స్ధాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు .ప్రతి మండలం లో పీఎంపీ సభ్యులు క్యాన్సర్ నియంత్రణకు కృషి చేయాలని కోరారు.ఈ ర్యాలీ ప్రెస్ క్లబ్ నుండి మొదలై దేవిచౌక్ మీదుగా సాగింది.

ముందుగా జరిగిన సమావేశంలో రాజమండ్రి కి చెందిన డెల్టా హాస్పిటల్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సుమంత్ హాజరై మాట్లాడుతూ నేటి సమాజంలో జీవనశైలిలో మార్పులు, పర్యావరణ కాలుష్యం,మధ్యపానం, ధూమపానం వంటి అలవాట్లు వలన ఎక్కువగా క్యాన్సర్ కు గురవుతున్నారని,క్యాన్సర్ ను తొలి దశలో గుర్తిస్తే చికిత్స సులభం అని అన్నారు.మరో వైద్యులు డాక్టర్ కె నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ఉండే గ్రామీణ వైద్యులు ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలపై అవగాహన కల్గి ప్రజలకు మేలైన వైద్య సేవలందించాలని సూచించారు.అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీబీటి రాజు మాట్లాడుతూ ఈరోజు ప్రస్తుత జనాభాలో పదిమందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడుతున్నారని,దీనిపై ప్రతి ఒక్కరూ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని,రాష్ట్రంలో 40 వేల నుంచి 70 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని 50 వేల మంది చనిపోతున్నారని ప్రభుత్వ అంచనా అని అన్నారు. రాష్ట్ర స్ధాయిలో చేసే ఈ అవగాహన కార్యక్రమాల ద్వారా క్యాన్సర్ పై అవగాహన తో పాటు అపోహలు తొలగించాలని అన్నారు.

 అనంతరం ప్రెస్ క్లబ్ నుండి దేవిచౌక్ వరకు స్థానిక కెవిఎస్ కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పీ దేవానందం, జిల్లా కోశాధికారి పీ చిన్ని, పశ్చిమగోదావరి జిల్లా కోశాధికారి ఎమ్ జితేంద్ర, మండల కార్యదర్శి వై పవన్ కుమార్, కోశాధికారి డి నాగార్జున, కోరుకొండ మండల అధ్యక్షులు కుంచే వినోద్, కార్యదర్శి ఎస్ భాస్కర్, కోశాధికారి బీహెచ్ శివకుమార్, మాజీ కోశాధికారి జి లాజర్ లతో పాటు సభ్యులు హాజరయ్యారు.అసోసియేషన్ తరుపున 5,000/-లు గోకవరం ప్రెస్ క్లబ్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రాజు,ప్రధాన కార్యదర్శి శివ మీడియా మిత్రులకు సహకారం అందించారు .అనంతరం వైద్యులను సభ్యులు సత్కరించారు.