నూజివీడు :ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరియు రాష్ట్ర గృహనిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడి...
రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి వుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గురువారం ఆగిరిపల్లిలో కొండపై వేంచేసియున్న శ్రీ శోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహస్వామి మరియు దుర్గాపార్వతి సమేత మల్లిఖార్జునస్వాముల ఆలయంనకు రూ. 2 కోట్ల లతో రెండు కిలోమీటర్ల మేర ఘాట్ రోడ్డు నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరియు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తో కలిసి శంఖుస్ధాపన చేశారు. దాతలైన శ్రీమడుపల్లి రామనాగలక్ష్మీనారాయణరావు, వారి అన్నగారి కుమారుడైన గోపాల్ వారి కుటుంబ సభ్యులతో నిర్మించిన శ్రీశోభనాచలవ్యాఘ్రలక్ష్మీనరసింహస్వామి వార్ల కళ్యాణమండపాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో దేవాలయాలు పరిరక్షణకు అవసరమైన ప్రణాళికలు రూపొందించి అమలుచేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
దేవాలయాల్లో రూ. 50 వేలు లోపు ఆదాయం వున్న ఆలయాల్లో దూప, దీప నైవేద్యాలు పధకం కింద ఇస్తున్న ఐదువేలు రూపాయలను రూ. 10 వేలు రూపాయలు పెంచుతున్నామన్నారు. చిన్న చిన్న ఆలయాల్లోవున్న 5600 మంది అర్చకులకు ప్రస్తుతం వారికి ఇస్తున్న గౌరవేతనాన్ని రూ. 5 వేలరూపాయలు నుండి రూ. 10 వేలు పెంచడం జరిగిందన్నారు. రూ. 50 వేలు పైబడి రూ. 5 లక్షల లోపు ఆదాయం కలిగిన దేవాలయాలలో అర్చకులకు గతంలో రూ. 10 వేలు ఉండేదని వీటిని రూ. 15 వేలకు పెంచడ జరిగిందని తెలిపారు. త్వరలో ఆలయాల కమిటీలు నియమించడానికి చర్యలు తీసుకున్నామని ప్రస్తుతం రాష్ట్రంలో కమిటీలు వేయగలిగిన 1800 ఆలయాలకు కమిటీలు ఉన్నాయని, కమిటీలు లేనివి 27 వేలు ఉన్నాయని తెలిపారు.
కమిటీల్లో ఓ.సి,బి.సి., ఎస్సీ, ఎస్టీలతోపాటు స్వామివారి సేవలోవున్న బ్రహ్మణ కుటుంబాలకు చెందిన వ్యక్తికి, అలాగే నాయీబ్రహ్మణలకు చెందిన వ్యక్తికూడా పాలక మండలిలో సభ్యులుగా చేర్చడానికి ముఖ్యమంత్రి ఆదేశాలతో చట్టం తయారైయిందని దీనినిబట్టి ప్రస్తుత పాలకవర్గంతోపాటు మరో రెండు పాలక సభ్యులు నియమించడం జరుగుతుందని తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలోని దేవాదాయశాఖకు సంబంధించిన శిథిలావస్ధలోవున్న ఆలయాల పునర్నిణానికి కామన్ గుడ్ ఫండ్ కింద ఉన్న నిధులు సమకూర్చడానికి అలాగే టిటిడి దేవస్ధానం శ్రీవాణిట్రస్ట్ నుండి నిధులను కూడా ఆలయ పునర్నిణానికి ఆయా ప్రాంతాల ఆదాయవనరులను బట్టి స్ధానిక భాగస్వాములతో 10 లక్షల నిధులు కేటాయిస్తామని మంత్రి తెలిపారు.
ప్రజలు ఇచ్చిన విజయాన్ని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు కూటమి నాయకత్వంతో రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి వచ్చే 5 సంవత్సరాలలో ఎన్నికల్లో ఇచ్చిన మ్యానిపెస్టివల్ ప్రకారం అమలు చేయడానికి ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. స్వామివారి సన్నిధిలో భక్తులకు సౌకర్యార్ధం కళ్యాణమండపాన్ని నిర్మించిన దాతలను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు.రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి మాట్లాడుతూ... నూజివీడు నియోజకవర్గంలోని దేవాలయాలను అభివృద్ధి చేయడంతోపాటునూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేసి, పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి నూజివీడు నియోజకవర్గంలో వెయ్యి స్వయంభూ క్షేత్రాలు ఉన్నాయని వీటికి వేలాది ఎకరాల అటవీభూమి, వేలాది ఎకరాలు రిజర్వాయర్ లతో కూడిన చెరువులు ఉన్నాయని దీనిద్వారా పర్యాటక రంగంగా, పుణ్యక్షేత్ర కేంద్రాలుగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.
పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధిని బట్టి భూముల విలువలు పెరుగుతాయని దీనితో ప్రజల ఆర్ధిక స్ధితిగతులు మెరుగవుతాయన్నారు. నియోజకవర్గ ప్రజలు చాలా సంవత్సరాల నుంచి శ్రీ శోభనాచల వ్యాఘ్రలక్ష్మీనరసింహస్వామి మరియు దుర్గాపార్వతి సమేత మల్లిఖార్జునస్వాముల ఆలయంనకు ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రజలకు బలీయమైన కోర్కెను తీరనుందని ఈ అవకాశాన్ని స్వామి నాకు కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి తెలిపారు.
ఈ దేవాలయానికి శ్రీమడుపల్లి రామనాగలక్ష్మీనారాయణరావు, అన్నగారి కుమారుడైన గోపాల్, ఆర్ధిక సహాయంతోకళ్యాణమండపాన్నినిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కళ్యాణ మండపాన్ని ఇంకా అభివృద్ధిచేయడానికి, ఎ.సి.లను ఏర్పాటుచేయడానికి కృషి చేస్తానని వెల్లడించారు. నూజివీడు నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలకు వేలాదిఎకరాల భూములు ఉన్నాయని వీటిలో రఘునందస్వామీ గుడి, నూజివీడు వెంకటేశ్వరస్వామి గుడికి వేలాదిఎకరాలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి అనుభవజ్ఞులైన రాజకీయవేత్తని, ఈ నియోజకవర్గంలో క్రీడారంగాన్ని అభివృద్ధిలో భాగంగా స్టేడియం ఏర్పాటులో దేవాదాయశాఖ మంత్రిగా తనపరపతిని ఉపయోగించి సహకారం అందించాలని కోరారు. అనంతరం మంత్రులను శాలువాలతో, పుష్పగుచ్చాలతో సన్మానించి స్వామివారిచిత్రపటాన్నిబహూకరించారు. కార్యక్రమానికి ముందు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరియు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి లకు వేదపండితులతో, మంగళవాయిద్యాలతో దేవాదాయశాఖ ఉప కమీషనరు డిఎల్ వి రమేష్ బాబు, ఏలూరు జిల్లా దేవాదాయశాఖ అధికారి సిహెచ్ రంగారావు, దేవస్ధానం ఇవో డి. సురేష్ బాబు, పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
కార్యక్రమంలో నూజివీడు ఆర్డిఓ వై. భవానీశంకరి, తహశీల్దారు ప్రసాద్, గ్రామ సర్పంచ్ లక్ష్మి, ప్రజాప్రతినిధులు, దేవస్ధానం పురోహితులు, వేదపాఠశాల విద్యార్ధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.