ఏలూరు:-
ఏలూరు పార్లమెంటు పరిధిలో నేషనల్ హైవేస్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కు ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.. ఈ మేరకు దిల్లీ కార్యాలయంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ కలిసి నాలుగు సమస్యలతో కూడిన వినతి పత్రాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అందజేశారు. 216ఎ, 365బీజీ, ఎన్ హెచ్ 16 పై అభివృద్ధి పనులు, సరైన రక్షణ చర్యలు కల్పించాలని కోరారు. లింగగూడెం, కమలాపురం, రాఘవాపురంలో పామాయిల్ రైతులు పండించిన పంట ఉత్పత్తులు తరలించడానికి వీలుగా కనెక్టివిటీ రోడ్డు నిర్మించాలని విన్నవించారు.
చింతలపూడి మండలం లింగగూడెం, కమలాపురం, రాఘవాపురం గ్రామాల రైతులు సరైన అప్రోచ్ రోడ్డు లేకపోవడంతో పామాయిల్ తోటలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని ఛైర్మన్ దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు.
ఖమ్మం నుండి దేవరాపల్లి ఎన్ హెచ్ 365 బి జి గ్రీన్‌ఫీల్డ్ హైవే అభివృద్ధి నేపథ్యంలో సి హెచ్ 92+150 నుంచి 93+450 మధ్య ఉన్న పామాయిల్, ఇతర వ్యవసాయ ఉత్పత్తుల తరలించడానికి వీలుగా కనెక్టివిటీ రహదారిని నిర్మించాలని రైతుల తరపున ఎంపీ అభ్యర్థించారు.ఏలూరు జిల్లా పరిధిలోని ఖమ్మం-దేవరపల్లి 365 బిజి నేషనల్ హైవే గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్ వెంబడి సర్వీస్ రోడ్లు మంజూరు చేయాలని, ప్రతిపాదిత సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఛైర్మన్ కు వివరించారు. ఖమ్మం-దేవరపల్లి ఎక్స్‌ప్రెస్‌వే, నిర్మాణంలో ఉన్న 4-లేన్ యాక్సెస్-నియంత్రిత హైవే మరియు చింతలపూడి మండలం గురుబట్లగూడెం నుంచి రేచర్ల-గురవాయిగూడెం వరకు సర్వీస్ రోడ్లు మంజూరు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
ఏలూరు జిల్లా కొత్తగూడెం, దెందులూరు మండలం సీతంపేట లో 2020-2023 మధ్యకాలంలో రోడ్డు పనులు చేపట్టినా, సరైన రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో, విద్యార్థులు, కూలీలు, 200 గ్రామాల ప్రజలు రహదారి దాటే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారని, గత రెండేళ్లలో 10 మంది మృత్యువాత పడగా 40 మంది గాయపడ్డరని సమస్య తీవ్రతను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఛైర్మన్ కు వివరించారు గుండుగొలను నుండి కొవ్వూరు రోడ్డు వరకు ఎన్ హెచ్-16లో అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తూ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సీతంపేట జంక్షన్ వద్ద 4 మీటర్ల ఎత్తు బాక్స్ కల్వర్ట్ లేదా పి యు పి, సి యు పి నిర్మాణం, గుండుగొలను దేవరపల్లి-కొవ్వూరు సెక్షన్‌లో విద్యార్థులు
రాకపోకలు సాగించేందుకు ఓవర్‌బ్రిడ్జి మధ్య సర్వీస్ రోడ్డు, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఛైర్మన్ కు విన్నవించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నుండి గుండుగొలను వరకు నిర్మించిన సర్వీస్ రోడ్ల వెంబడి లైటింగ్‌ను మెరుగుపరచాలని, ప్రమాదాలను నివారించడానికి పోలీసు పెట్రోలింగ్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను పెంచాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గుండుగొలను, భీమడోలు, కూరెళ్లగూడెం, పూళ్ల, కైకరం, చేబ్రోలు, నారాయణపురం, ఉంగుటూరు రెండు కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్, సబ్ వేలను నిర్మించాలి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.
బ్లైండ్ స్పాట్ బాధిత గ్రామాల ప్రజలు సర్వీసు రోడ్డుతో కలిగిన ఫ్లై ఓవర్లు నిర్మించాలని, భీమడోలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని అయ్యప్ప స్వామి గుడి వద్ద ఉన్న పుంతకు మార్చాలని, సాధ్యమైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని ప్రజలు తనకు చేసిన విజ్ఞప్తులను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చైర్మన్ కు వివరించారు.
ఏడు బ్లైండ్ స్పాట్ వద్ద ఫ్లై ఓవర్లు లేదా సబ్‌వేల నిర్మాణం కోసం అంచనాలను సిద్ధం చేయడానికి సంబంధిత అధికారులను ఆదేశించాలని ఎంపీ కోరారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ సానుకూలంగా స్పందించి అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.