గొల్లపూడి:-
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్ గొల్లపూడి భారతదేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఆ మహానుభావుడి జీవితం మనకు నిత్య ప్రేరణ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో కలాం జయంతిని పురస్కరించుకొని స్థానిక నేతలతో కలసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇంజనీరుగా, శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంగారు ఆయన సేవలను ఈ జాతికి అందించాడన్నారు. కలలు కనండి.
వాటిని సాకారం చేసుకోండి అంటూ యువతలో స్ఫూర్తిని నింపిన మిస్సైల్ మ్యాన్ కలాం అని పేర్కొన్నారు. మారుమూల గ్రామంలో జన్మించి, దేశ ప్రథమ పౌరుడి స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. భారత దేశ రక్షణ రంగాన్ని అగ్ర పథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి, రాష్ట్రపతికే వన్నె తెచ్చిన మహనీయుడు అని కొనియాడారు. భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్నతో పాటు అనేక అవార్డులను పొందారని అన్నారు. రాష్ట్రపతి భవన్ నుండి వెళ్లేటప్పడు అవార్డులన్నీ వదిలి కట్టుబట్టులు చేతిసంచితో వెళ్లిపోవడం ఆయన నిరాడంబరతకు నిదర్శనమన్నారు. ఆయన జీవిత చరిత్ర తెలుసుకొని, స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాలన్నారు.